గుండె ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేందుకు చాలా పరీక్షలే ఉన్నాయ్..!

  • మారిన జీవనశైలితో గుండెకు పెరిగిన ముప్పు
  • ముందస్తు వైద్య పరీక్షలే మెరుగైన రక్షణ
  • అందుబాటులో ఎన్నో రకాల వైద్య పరీక్షలు
మారిన జీవనశైలితో పెద్ద ముప్పు ఎదుర్కొంటున్నది హృదయమే. ఎంతో మంది గుండె జబ్బుల బారిన పడుతుండగా, ఏటా లక్షలాది మంది గుండె వైఫల్యంతో మరణిస్తున్నారు. కనుక గుండె గురించి పట్టించుకోకుండా ఉండలేని రోజులు ఇవి. మన శరీర అవయవాల్లో అత్యంత కీలకమైనది గుండె. జీవనశైలి మార్పుల వల్ల రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ తదితర రూపంలో గుండెకు ముప్పు వచ్చి పడుతోంది. కనుక క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్యను ముందే గుర్తించడానికి వీలుంటుంది.

లిపిడ్ ఫ్రొఫైల్
కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ ఎలా ఉన్నవీ తెలుస్తుంది. రక్తంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు పదార్థాల గురించి తెలుసుకోవచ్చు. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు రక్త ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడి గుండెకు కావాల్సినంత రక్తం అందదు. దీనివల్ల అధిక రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. తర్వాత హార్ట్ ఎటాక్, ఇతర గుండె సమస్యలకు దారితీయవచ్చు.

టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్, ఇతర పారా మీటర్లను ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. రక్తంలో ఏ మేర కొవ్వులు ఉన్నాయనేది తెలుస్తుంది. అథెరోస్క్లోరోసిస్ వచ్చే అవకాశాలను తెలియజేస్తుంది. హార్ట్ ఎటాక్ లకు ఇదే ప్రధాన కారణంగా ఉంటోంది. 

కార్డియాక్ రిస్క్, కార్డియాక్ స్క్రీన్ టెస్ట్
కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, స్థూలకాయం చరిత్ర ఉంటే మిగిలిన వారు జాగ్రత్తగా ఉండాలి. కార్డియాక్ రిస్క్ మేకర్స్ టెస్ట్ ద్వారా గుండె జబ్బుల రిస్క్ ను ముందుగానే గుర్తించొచ్చు. 

ఈసీజీ, టీఎంటీ, హార్ట్ స్కాన్
తక్కువ నుంచి మోస్తరు రిస్క్ ఉంటే అది ఈసీజీలో కనిపించదని వైద్యులు చెబుతున్నారు. దీనికి బదులు స్ట్రెస్ టెస్ట్ లేదా త్రెడ్ మిల్ టెస్ట్ మెరుగైన మార్గం అవుతుంది. శారీరకంగా శ్రమ ఎక్కువైనప్పుడు గుండె తట్టుకునే సామర్థ్యాన్ని త్రెడ్ మిల్ టెస్ట్ చెబుతుంది. గుండె సామర్థ్యం ఏపాటిదో దీంతో తెలుస్తుంది. ఇక హార్ట్ స్కాన్ లేదా కరోనరీ క్యాల్షియం పరీక్ష అన్నది రక్త నాళాల్లో కొవ్వు ఫలకాలను తెలియజేస్తుంది. రక్త ప్రవాహానికి అడ్డంకులు వీటివల్లే ఏర్పడతాయి. 

గుండె ఎంత సమర్థవంతంగా పంప్ చేయగలుగుతున్నదీ దీని ద్వారా తెలుస్తుంది. గుండె పనితీరును అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ ను అంచనా వేయవచ్చు. క్రమం తప్పిన గుండె స్పందనలను కూడా గుర్తించొచ్చు.

ఈకో కార్డియోగ్రామ్
అల్ట్రాసౌండ్ పరీక్ష ఇది. గుండె గదులను, వాల్వ్ ల గురించి మరింత స్పష్టంగా తెలుసుకోవచ్చు. గుండె ఎంత సమర్థవంతంగా రక్తాన్ని పంప్ చేస్తుందో చెబుతుంది. 

న్యూక్లియర్ కార్డియాక్ స్ట్రెస్ టెస్ట్


ఇది డ్యుయల్ ఐసోటోప్ త్రెడ్ మిల్ టెస్ట్. రక్తంలోకి రేడియో యాక్టివ్ ఇంజెక్షన్ చేస్తారు. దీంతో శక్తి విడుదలై గుండెకు చేరుతుంది. ప్రత్యేకమైన కెమెరాలు ఈ శక్తిని గుర్తిస్తాయి. గుండె కండరాలకు రక్త సరఫరా ఏ మేరకు ఉందో, గుండె రక్తాన్ని ఎలా పంప్ చేస్తుందో ఫొటోల ద్వారా డాక్టర్ తెలుసుకుంటారు. 

కరోనరీ యాంజియోగ్రామ్
దీనినే కార్డియాక్ క్యాథటరైజేషన్ అని కూడా పిలుస్తారు. తొడ, చేయి, మణికట్టు నుంచి నరం ద్వారా సూక్ష్మ ట్యూబ్ ను గుండెకు పంపించి చేసే పరీక్ష ఇది. దీనివల్ల కరోనరీ ఆర్టరీల్లో అడ్డంకులను (పూడికలను) తెలుసుకోవచ్చు. 

ఎంఆర్ఐ 
గుండెకు చేసే ఎంఆర్ఐ ద్వారా.. గుండె కు సంబంధించిన వ్యవస్థలో సమస్య ఎక్కడ ఉన్నా తెలుసుకోవచ్చు. దీని ద్వారా కరోనరీ ఆర్టరీలను మరింత స్పష్టంగా చూడొచ్చు. సమస్య ఎక్కడ ఉన్నా దాదాపు తెలుస్తుంది.


More Telugu News