మరో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన విరాట్​ కోహ్లీ

  • టీ20ల్లో అత్యధికంగా 32 అర్ధ శతకాలతో రోహిత్ ను దాటేసిన కోహ్లీ
  • నిన్న పాకిస్థాన్ పై  44 బంతుల్లోనే 60 రన్స్ చేసిన విరాట్
  • ఈ ఫార్మాట్ లో పాక్ పై నాలుగో ఫిఫ్టీతో మరో రికార్డు కూడా సమం 
దాదాపు రెండేళ్లుగా పేలవ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ ఆసియా కప్ లో సత్తా చాటుతున్నాడు. ఒక్కో మ్యాచ్ జరుగుతున్న కొద్దీ తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు. పాకిస్థాన్ తో తొలి మ్యాచ్ లో  టచ్ లోకి వచ్చిన విరాట్.. హాంకాంగ్ పై అర్ధ సెంచరీతో ఫామ్ అందుకున్నాడు. తాజాగా ఆదివారం రాత్రి పాకిస్థాన్ తో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో మునుపటి విరాట్ కోహ్లీని చూపించాడు. ఈ మ్యాచ్ లో 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులతో టాప్ స్కోరర్ నిలిచాడు. కేవలం 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్కు దాటిన అతను నెమ్మదిగా ఆడుతున్నాడన్న విమర్శలకు చెక్ పెట్టాడు. పైగా, సిక్సర్ తో అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. 

ఈ మెరుపు ఇన్నింగ్స్ తో తన పూర్వపు ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ ఓ ప్రపంచ రికార్డు కూడా బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధ శతకాలు చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. పాక్ పై చేసిన ఫిఫ్టీ కోహ్లీ కెరీర్లో 32వ అర్ధ శతకం. ఈ క్రమంలో 31 అర్ధ సెంచరీలతో మొన్నటిదాకా అగ్రస్థానంలో ఉన్న తన సహచరుడు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను విరాట్ వెనక్కి నెట్టాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ 27 అర్ధ శతకాలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (23), న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్టిల్ (22) టాప్-5లో చోటు దక్కించుకున్నారు. 

కాగా, పాకిస్థాన్ పై విరాట్ కోహ్లీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గతేడాది ఇదే దుబాయ్ స్టేడియంలో పాక్ తో జరిగిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లోనూ కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. టీ20ల్లో పాక్ పై కోహ్లీ ఇప్పటిదాకా నాలుగు ఫిఫ్టీలు చేశాడు. తద్వారా పాక్ జట్టుపై ఎక్కువ అర్ధ సెంచరీలు చేసిన క్రికెటర్ గా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. ఆరోన్ ఫించ్, కేన్ విలియమ్సన్, కెవిన్ పీటర్సన్, మార్టిన్ గప్టిల్ కూడా పాకిస్థాన్ పై  ఈ ఫార్మాట్లో నాలుగేసి అర్ధ శతకాలు చేశారు.


More Telugu News