సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాద ఘటన ... ఆ సమయంలో కారు నడుపుతోంది ఓ లేడీ డాక్టర్!

  • మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం
  • టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ దుర్మరణం
  • ఓ డాక్టర్ కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్న మిస్త్రీ
  • కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం
టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఓ రోడ్డు ప్రమాదం ఘటనలో మృతి చెందడం తెలిసిందే. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రమాద సమయంలో ఓ మహిళ కారు నడిపినట్టు పోలీసులు గుర్తించారు. సైరస్ మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబయి వస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. 

"ముంబయికి చెందిన ప్రముఖ వైద్యురాలు అనహిత పండోలే ఆ సమయంలో కారు నడుపుతున్నారు. ముందు సీట్లో ఆమె పక్కనే భర్త డారియస్ పండోలే కూర్చున్నారు. వెనుక సీట్లో డారియస్ సోదరుడు జహంగీర్ పండోలే, టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కూర్చున్నారు. 

పాల్ఘాట్ జిల్లాలో చరోటీ వద్ద అనహిత పండోలే రాంగ్ సైడ్ నుంచి మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో వారు ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు 120 కిమీ వేగంతో వెళుతోంది. కారు అదుపుతప్పడంతో డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సైరస్ మిస్త్రీతో పాటు వెనుక సీట్లో కూర్చున్న జహంగీర్ పండోలే కూడా మృతి చెందారు. ముందు సీట్లో ఉన్న అనహిత, ఆమె భర్త డారియస్ గాయాలతో బయటపడ్డారు" అని పోలీసులు వివరించారు.


More Telugu News