గుమ్మడి పండుతో బోటు చేసుకుని.. 38 మైళ్లు నదిలో ప్రయాణం.. గిన్నిస్​ రికార్డు పట్టేశాడు!

  • అమెరికాలోని మిస్సోరీ నదిలో ఓ పెద్దాయన సాహసం
  • తన పుట్టిన రోజున ప్రత్యేకంగా ఫీట్ చేసిన డ్యూన్ హాన్సెన్
  • ఒంటరిగా 10 గంటలకుపైగా ప్రయాణించి లక్ష్యాన్ని చేరుకున్న తీరు
సాధారణంగా నదిలో ఎలా ప్రయాణిస్తారు.. పడవల్లోనో, మరబోట్లలోనో వెళ్తారు. మహా అయితే తెప్పలు వాడుతారు. ఇవి కొద్ది దూరం వెళ్లడానికి మాత్రమే. కానీ డ్యూన్ హాన్సెన్ మాత్రం ఓ పెద్ద గుమ్మడి పండును బోటులా చేసుకుని నదిలో ఏకంగా 38 మైళ్లు (సుమారు 60 కిలోమీటర్లు) ప్రయాణం చేసి.. గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు. అమెరికాలోని మిస్సోరీ నదిలో ఇటీవలే ఈ ఫీట్ చేశాడు. చిత్రమేమిటంటే.. ఇలా గుమ్మడి పండు బోటులో ప్రయాణించిన ఆయన వయసు 60 ఏళ్లు కావడం, అదీ ఆయన తన పుట్టినరోజున ఈ ఫీట్ చేయడం గమనార్హం.

పాత రికార్డును బ్రేక్ చేస్తూ..  
  • గుమ్మడి పండు బోట్ లో నదిలో ప్రయాణించిన రికార్డు ఇంతకు ముందు వాషింగ్టన్ కు చెందిన రిక్ స్వెన్సన్ అనే వ్యక్తి పేరు మీద ఉంది.  అతను 2016లో రెడ్ రివర్ నదిలో 25.5 మైళ్ల దూరం అలా ప్రయాణించాడు.
  • ఆ రికార్డును బీట్ చేయాలని డ్యూన్ హాన్సెన్ నిర్ణయించుకున్నాడు. ఓ పెద్ద గుమ్మడి పండు తెప్పించుకుని.. దాని లోపలి భాగమంతా తొలగించి చిన్న బోటులా మార్చుకున్నాడు. దాని లోపల కొన్ని అత్యవసరమైన సామగ్రి వేసుకుని, తెడ్డు పట్టుకుని నదిలో ప్రయాణించడం మొదలుపెట్టాడు. 
  • బెల్లూవ్స్  గ్రామం నుంచి నెబ్రస్కా పట్టణం వరకు 38 మైళ్ల దూరం ఈ గుమ్మడి పండు బోటులో డ్యూన్ ప్రయాణించాడు. పొద్దున 7.30కు బయలుదేరితే.. సాయంత్రం 6.30 గంటలకు చేరుకున్నాడు. 
  • ఎవరి సాయం లేకుండా ఒక్కడే తెడ్డు సాయంతో ప్రయాణిస్తూ వచ్చాడు. దీనంతటినీ గిన్నిస్ బుక్ ప్రతినిధులు పరిశీలించారు. మొత్తానికి పెద్దాయన సాధించేశాడు అంటూ రికార్డు ఇచ్చేశారు.


More Telugu News