టీ20 ప్రపంచ కప్​ కూ జడేజా దూరమే అంటున్న బీసీసీఐ.. ఇప్పుడే చెప్పలేమంటున్న కోచ్ ద్రవిడ్!

  • జడేజా కుడి మోకాలికి  తీవ్ర గాయం
  • ఆసియా కప్ ధ్యలోనే వైదొలిగిన వైనం
  • మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోనున్న స్టార్ ఆల్ రౌండర్
వచ్చే నెలలో మొదలయ్యే టీ20 వరల్డ్‌ ‌‌‌కప్‌‌‌‌నకు ముందు భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. గాయం కారణంగా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆ టోర్నీకి దూరం అయ్యేలా ఉన్నాడు. ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతున్న ఆసియా కప్ లో జడేజా తొలి రెండు మ్యాచ్ ల్లో పాల్గొని అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ, మోకాలు గాయానికి గురై పాకిస్థాన్ తో సూపర్ 4 మ్యాచ్ కి ముందు ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం జడేజా స్వదేశానికి తిరిగొచ్చాడు. అతని మోకాలికి తీవ్ర గాయం అయింది. దీనికి శస్త్ర చికిత్స అవసరం అని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో జడ్డూ కొన్ని నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. 

‘జడేజా మోకాలుకు తీవ్రమైన గాయం అయింది. దీనికి మేజర్‌‌‌‌ సర్జరీ అవసరం. కాబట్టి కొంతకాలం అతను ఆటకు దూరంగా ఉంటాడు. జడేజాను పరీక్షించిన ఎన్‌‌‌‌సీఏ వైద్య బృందం అతను అంతర్జాతీయ క్రికెట్లోకి ఎప్పుడు తిరిగొస్తాడో అంచనా వేయలేకపోయింది’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కాబట్టి అతను ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్, నవంబర్లో జరిగే టీ20 ప్రపంచ కప్ లో పాల్గొనడని చెప్పారు. అయితే, జడేజా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌కు దూరం అయ్యాడని ఇప్పుడే చెప్పలేనని కోచ్‌‌ రాహుల్ ద్రవిడ్‌‌ అంటున్నాడు. ఆ మెగా టోర్నీకి మరో 6-8 వారాల సమయం ఉన్నందున ఆలోపు జడేజా కోలుకుంటాడేమో చూడాలన్నాడు. దాంతో, జడేజా విషయంలో స్పష్టత లేకుండా పోయింది. నాణ్యమైన స్పిన్ బౌలింగ్ తో  పాటు భారీ షాట్లు ఆడే సత్తా ఉన్న జడేజా కొన్నాళ్లుగా అన్ని ఫార్మాట్లలో భారత జట్టుకు కీలక ఆటగాడిగా ఉన్నాడు. అలాంటి ఆటగాడు లేకుంటే ప్రపంచ కప్ లో భారత అవకాశాలపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.


More Telugu News