ఇంటర్వ్యూలు లేకుండానే అమెరికా వీసాలు.. డిసెంబర్ 31 వరకే చాన్స్!
- కొన్ని నిర్దిష్ట కేటగిరీలకే ఈ వెసులుబాటు వర్తిస్తుందని వెల్లడి
- గడువు ముగిసిన 48 నెలల్లోపు రెన్యూవల్ చేసుకునేవారికీ వర్తిస్తుందని ప్రకటన
- కరోనా సమయంలో వీసా రుసుము చెల్లించిన వారికి గడువు పొడిగిస్తున్నట్టు వివరణ
ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే భారతీయులకు వీసాలు మంజూరు చేయాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు కాన్సులేట్ అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కొన్ని నిర్దిష్ట కేటగిరీల దరఖాస్తు దారులకు మాత్రమే.. అది కూడా ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికల్లా దరఖాస్తు చేసుకున్న వారికే వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఎవరెవరికి.. ఎంతవరకు?
ఎవరెవరికి.. ఎంతవరకు?
- ప్రస్తుతం భారతీయులకు జారీ చేస్తున్న వీసాలలో.. ఎఫ్, హెచ్-1, హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్, ఎం, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే వీసాలను ఇంటర్వ్యూ అవసరం లేకుండానే జారీ చేయనున్నట్టు అమెరికా తెలిపింది.
- ఇక ఇప్పటికే వీసా గడువు ముగిసిపోయినవారు.. గడువు ముగిసిన తర్వాత 48 నెలల్లోపు రెన్యూవల్ చేయించుకుంటే ఇంటర్వ్యూ లేకుండానే ప్రక్రియ ముగించనున్నట్టు ప్రకటించింది. అయితే గతంలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి మాత్రం వర్తించదని పేర్కొంది.
- ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్ మెంట్ల కోసం వేచి ఉండాల్సిన సమయం ఇంకా ఎక్కువే ఉండనుందని.. కరోనా నాటి ఇబ్బందులే దీనికి కారణమని వెల్లడించింది.
- ఇప్పటికే వీసా దరఖాస్తు రుసుము చెల్లించి ఉన్నవారు ఆందోళన పడవద్దని.. కరోనా వీసా దరఖాస్తు రుసుము చెల్లించినవారికి వీసా ప్రక్రియ గడువును 2023 సెప్టెంబర్ 23వ తేదీ వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది.