బంగ్లాదేశ్ యువతిని పెళ్లాడిన చెన్నై మహిళ.. సంప్రదాయబద్ధంగా జరిగిన వివాహం

  • కెనడాలో ఉంటున్న ఇరు కుటుంబాలు
  • ప్రేమగా మారిన పరిచయం
  • ఆరేళ్లపాటు తల్లిదండ్రులతో పోరాడి పెళ్లికి ఒప్పించిన సుభిక్ష
  • గత నెల 31న బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో జరిగిన వివాహం
ప్రకృతి విరుద్ధంగా జరిగే పెళ్లిళ్లు ఎప్పుడూ ఆసక్తికరమే. ఇటీవల ఇలాంటి వివాహాల జోరు ఎక్కువైంది. ప్రేమించిన వారిని పెళ్లాడేందుకు తల్లిదండ్రులతో పోరాడి, వారిని ఒప్పించి ఒక్కటైన ఇలాంటి స్త్రీ, పురుష జంటలు చాలానే ఉన్నాయి. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ యువతి, బంగ్లాదేశ్‌లోని హిందూ కుటుంబానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంది. తమిళనాడు సంప్రదాయ బ్రాహ్మణ వివాహ పద్ధతిలో గత నెల 31న జరిగిన ఈ పెళ్లి విషయం తాజాగా వెలుగు చూసింది.

తమిళనాడులోని మదురైకి చెందిన సుబ్రమణి కుటుంబం కెనడాలోని కల్గరీలో స్థిరపడింది. ఆయన కుమార్తె సుభిక్ష సుబ్రమణికి బంగ్లాదేశ్ హిందూ కుటుంబానికి చెందిన టీనా దాస్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. టీనా కుటుంబం కూడా కల్గరీలోనే ఉంటోంది. 19 ఏళ్ల వయసున్నప్పుడే సుభిక్ష ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. టీనాను పెళ్లాడతానని స్పష్టం చేసింది. అందుకు వారు అంగీకరించలేదు. చివరికి తల్లిదండ్రులతో ఆరేళ్ల పోరాటం తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో చెన్నైలో గత నెల 31న వీరి వివాహం జరిగింది. 

పెళ్లి రోజున తమిళ బ్రాహ్మణ పద్ధతిలో సుభిక్ష, టీనా దాస్ ఇద్దరూ తమ తండ్రుల ఒడిలో కూర్చున్నారు. ఆ తర్వాత దండలు మార్చుకున్నారు. పెళ్లి చేసుకోవాలన్నది తమ కల అని, నెరవేరుతుందని తాము అనుకోలేదని సుభిక్ష, టీనాలు చెప్పుకొచ్చారు. 29 ఏళ్ల సుభిక్ష డెలాయిట్‌లో చార్టర్డ్ అంకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. సుభిక్ష తల్లి పూర్ణ పుష్పకళ కల్గరీలో ప్లే స్కూల్ నిర్వహిస్తున్నారు. 35 ఏళ్ల టీనా లెస్బియన్. ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న నాలుగేళ్ల తర్వాత ఆ బంధం నుంచి బయటకు వచ్చారు. టీనా కల్గరీలోని ఫుట్‌హిల్స్ మెడికల్ సెంటర్‌లో పేషెంట్ కేర్ విభాగంలో పనిచేస్తున్నారు.



More Telugu News