పొలం కోసం పోరాడుతూ ప్ర‌భుత్వ కార్యాల‌యంలో ప్రాణాలు విడిచిన రైతు

  • చిత్తూరు జిల్లా పెనుమూరులో ఘ‌ట‌న‌
  • పొరుగు గ్రామ వాసుల‌తో ఏళ్లుగా భూ వివాదం
  • పొలంలో ప‌క్కా ఇళ్లు నిర్మించ‌డంతో త‌హ‌సీల్దార్‌ను ఆశ్ర‌యించిన వైనం
  • స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధితో జ‌రిగిన వాగ్వాదంలో అనారోగ్యం
  • ఆసుప‌త్రి నుంచి తిరిగి వ‌చ్చి రెండు రోజులుగా త‌హ‌సీల్దార్ కార్యాల‌యం ముందు నిర‌స‌న‌
  • అధికారుల‌తో మాట్లాడుతూనే కుప్ప‌కూలిన రైతు
త‌న జీవ‌నాధారం నిమిత్తం ప్ర‌భుత్వం త‌న‌కు ఇచ్చిన పొలాన్ని కాపాడుకునేందుకు పోరాటం సాగించిన ఓ రైతు... ఆ పోరులో భాగంగా అధికారుల‌తో మాట్లాడుతూ ప్ర‌భుత్వ కార్యాల‌యంలోనే కుప్ప‌కూలిపోయాడు. ఆసుప‌త్రికి త‌ర‌లించేలోగానే ప్రాణాలు విడిచాడు. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లా పెనుమూరు మండ‌ల కేంద్రంలోని త‌హ‌సీల్దార్ కార్యాల‌యంలో చోటు చేసుకుంది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... పెనుమూరు మండ‌లం రామ‌కృష్ణాపురం పంచాయ‌తీ ప‌రిధిలోని రాజా ఇండ్లు గ్రామానికి చెందిన రైతు ర‌త్నం (55)కు 1974లో ప్ర‌భుత్వం కొంత భూమిని ఇచ్చింది. ఈ భూమికి సంబంధించి ఆయ‌న‌కు ప్ర‌భుత్వం లీజు ప‌ట్టా కూడా ఇచ్చింది. అయితే ఈ భూమి ర‌త్నంకు చెంద‌కూడద‌న్న భావ‌న‌తో తిమ్మ‌రాజు కండ్రిగ వాసులు త‌ర‌చూ అభ్యంత‌రం చెబుతున్నారు. దీంతో 2009లో చిత్తూరు కోర్టును ఆశ్ర‌యించిన ర‌త్నం... ఆ భూమి త‌న‌దేన‌ని కోర్టు ద్వారా ప‌ర్మినెంట్ ఇంజ‌క్ష‌న్ ఆర్డ‌ర్ తెచ్చుకున్నారు.

ఆ త‌ర్వాత కూడా తిమ్మ‌రాజు కండ్రిగ వాసులు ర‌త్నంకు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూనే ఉన్నారు. ఇటీవ‌లే ర‌త్నం భూమిలో కొంద‌రు ప‌క్కా ఇళ్లు నిర్మించుకున్నారు. దీనిపైనా ఆయ‌న కోర్టుకు వెళ్లారు. ఈ క్ర‌మంలో 4 రోజుల క్రితం పక్కా ఇళ్లకు పోగా మిగిలిన భూమిని చ‌దును చేసేందుకు ర‌త్నం య‌త్నించ‌గా... వీఆర్వో అడ్డుకున్నారు. దీంతో అదే రోజు ఆయ‌న త‌హ‌సీల్దార్ ర‌మ‌ణిని క‌లిసి స‌మ‌స్య‌ను వివ‌రించారు. ఈ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధి ఒక‌రు ర‌త్నంతో వాగ్వావాదానికి దిగ‌గా... ర‌త్నం అనారోగ్యం పాలై ఆసుప‌త్రిలో చేరారు. 

ఆరోగ్యం కుదుట‌ప‌డిన ద‌రిమిలా శుక్ర‌వారం త‌హ‌సీల్దార్ కార్యాల‌యం ఎదుట ర‌త్నం నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగారు. శ‌నివారం కూడా ఆయ‌న నిర‌స‌న‌ను కొన‌సాగించారు. ఈ క్ర‌మంలో ర‌త్నంను కార్యాల‌యంలోకి పిలిచిన అధికారులు ఆయ‌న‌తో చ‌ర్చిస్తున్న స‌మ‌యంలో ర‌త్నం వారితో మాట్లాడుతూనే ఉన్న‌ట్టుండి కింద ప‌డిపోయారు. దీంతో వెనువెంట‌నే స్పందించిన అధికారులు ర‌త్నంను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే అప్ప‌టికే ర‌త్నం మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.


More Telugu News