మునుగోడు ప్ర‌జ‌లు నమ్మి ఓట్లు వేస్తే, రాజ‌గోపాల్ రెడ్డి దానిని రూ.22 వేల కోట్ల‌కు అమ్ముకున్నారు: రేవంత్ రెడ్డి

  • మునుగోడులో ప‌ర్య‌టించిన రేవంత్ రెడ్డి
  • ప్ర‌జ‌లు ఇచ్చిన గెలుపును అమ్ముకున్న వ్య‌క్తికి ఓటు వేయొద్ద‌ని పిలుపు
  • మునుగోడులో 97 వేల ఓట్లు కాంగ్రెస్ ఆస్తి అని వెల్ల‌డి
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మునుగోడు ప్ర‌జ‌లు ఆయనను నమ్మి ఓట్లు వేస్తే, దానిని రాజ‌గోపాల్ రెడ్డి రూ.22 వేల కోట్ల‌కు అమ్ముకున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జ‌లు ఇచ్చిన గెలుపును అమ్ముకున్న వ్య‌క్తికి ఓటు వేయ‌వ‌ద్ద‌ని ఆయ‌న మునుగోడు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు పార్టీ నేత‌లతో క‌లిసి శ‌నివారం మునుగోడులో ప‌ర్య‌టించిన రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజ‌గోపాల్ రెడ్డి తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఎక్క‌డైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే నియోజ‌కవ‌ర్గం అభివృద్ధి అవుతుందా? అని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. మునుగోడులో ఉన్న ఓట్ల‌లో 97 వేల ఓట్లు కాంగ్రెస్ ఆస్తి అని తెలిపారు. అంద‌రం క‌లిస్తే ఎవ‌రినైనా, ఎంత‌టి బ‌ల‌వంతుడినైనా ప‌డ‌గొట్ట‌వ‌చ్చ‌ని ఆయ‌న అన్నారు. మండ‌ల స్థాయి నేత‌లు రోజుకు కేవ‌లం 2 గంట‌లు కేటాయిస్తే... మునుగోడులో గెలుపు కాంగ్రెస్‌దేన‌ని ఆయ‌న తెలిపారు.


More Telugu News