ఈ జైల్లో ఫుడ్​ 5 స్టార్​.. ప్రతిష్ఠాత్మక సంస్థ రేటింగ్​!

  • ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జైలు ఆహారానికి గుర్తింపు ఇచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
  • దేశంలో ఆహార నాణ్యతకు ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపే ప్రామాణికం
  • ఈ జైలులో ఆహారం ‘అత్యుత్తమం’ అంటూ రేటింగ్
ఎవరినయినా 'నువ్వు జైలుకి వెళతావు' అనడానికి వ్యంగ్య ధోరణిలో 'నీకు చిప్ప కూడు తథ్యం' అంటుంటాం. అంటే, జైల్లో ఆహారం ఎలా.. ఎంత దారుణంగా ఉంటుందన్న దానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. అందుకు తగ్గట్టుగానే చాలా చోట్ల జైలు ఆహారం నాణ్యంగా లేదని గుర్తించిన ఘటనలూ ఉన్నాయి. 

కానీ ఉత్తరప్రదేశ్ లోని ఫరూకాబాద్ జైలుకు మాత్రం ఏకంగా ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది. మన దేశంలో ఆహార నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించే ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా).. ఇటీవలే ఫరూకాబాద్ జైలును సందర్శించింది. ఫుడ్ తయారు చేస్తున్న పద్ధతిని, అక్కడి పరిశుభ్రతను, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి.. ‘ఎక్స్ లెంట్’ అని సర్టిఫికెట్ ఇచ్చింది.

75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా..
  • దేశ 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా జైలులో సంస్కరణలు తేవాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జైలులో అత్యుత్తమ ఆహారాన్ని అందించాలని భావించి, అందుకు తగిన మార్పులు చేశారు. తమ ఆహారాన్ని పరిశీలించి, రేటింగ్ ఇవ్వాలని ఎఫ్ఎస్ఎస్ఏఐని కోరారు.
  • ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు ఫరూకాబాద్ జిల్లా జైలును సందర్శించి, ఆహారాన్ని పరిశీలించారు. వంట చేసే గదులు, ఇతర సదుపాయాలు, పరిశుభ్రత, నాణ్యత, వంట ఏ విధంగా చేస్తున్నారు, ఎలాంటి ఆహార పదార్థాలను వినియోగిస్తున్నారు అనే అంశాలను పరిశీలించారు. అనంతరం సర్టిఫికెట్ ఇచ్చారు.
  • ‘ఫరూకాబాద్ జిల్లా జైలును ‘ఈట్ రైట్ క్యాంపస్’గా ధ్రువీకరిస్తున్నాం. ఇక్కడి ఆహారానికి ఎక్స్ లెంట్ రేటింగ్ ఇస్తున్నాం. 2024 ఆగస్టు 18వ తేదీ వరకు ఈ ధ్రువీకరణ చెల్లుతుంది” అని పేర్కొంది.


More Telugu News