హీరో వర్సెస్ హోండా... దిగ్గజాల మధ్య అమ్మకాల యుద్ధం

  • ఒకప్పుడు భాగస్వాములుగా ఉన్న హీరో, హోండా
  • ప్రఖ్యాతిగాంచిన హీరోహోండా బ్రాండ్
  • కొంతకాలంగా వేర్వేరుగా అమ్మకాలు
  • పైచేయి చాటుకున్న హీరో
  • క్రమంగా పుంజుకుంటున్న హోండా టూవీలర్స్ ఇండియా
హీరోహోండా... ఈ బ్రాండ్ ఒకప్పుడు భారత్ ద్విచక్రవాహన రంగంలో ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలక్రమంలో హీరో, హోండా విడిపోయి ఎవరికివారు వేర్వేరుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. భారత ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో కాస్తా హీరో మోటోకార్ప్ కాగా, జపనీస్ దిగ్గజం హోండా కాస్తా హోండా టూవీలర్స్ ఇండియాగా రూపాంతరం చెందింది. 

కొంతకాలంగా దేశీయ ద్విచక్రవాహన విపణిలో హీరో మోటోకార్ప్ దే పైచేయిగా ఉంటోంది. కానీ హోండా కూడా అనతికాలంలోనే అమ్మకాల పరంగా పుంజుకుంది. అందుకు ఆగస్టు మాసంలో నమోదైన అమ్మకాలే నిదర్శనం. ఆగస్టులో హీరో, హోండా సంస్థలు విక్రయించిన ఓవరాల్ యూనిట్ల సంఖ్య మధ్య తేడా 85 మాత్రమే.

ఎగుమతులతో కలిపి గత నెలలో హీరో మోటోకార్ప్ 4,62,608 బైకులు, స్కూటర్లు విక్రయించగా... అదే సమయంలో హోండా 4,62,523 బైకులు, స్కూటర్లు విక్రయించడం విశేషం. గతేడాది ఆగస్టు మాసంతో పోల్చితే హోండా విక్రయాల్లో 7 శాతం వృద్ధి నమోదైంది. 

కాగా, దేశీయంగా హీరో మోటోకార్ప్ అత్యధిక అమ్మకాలు సాగించగా, ఎగుమతుల్లో మాత్రం హోండా ముందంజలో నిలిచింది. ఆగస్టులో హీరో మోటోకార్ప్ 11,868 ద్విచక్రవాహనాలు ఎగుమతి చేయగా, హోండా సంస్థ 39,307 ద్విచక్రవాహనాలను ఎగుమతి చేసింది. 

హోండా దేశీయ మార్కెట్లో 4,23,216 యూనిట్లు విక్రయించగా, హీరో 4,50,740 యూనిట్ల విక్రయాలతో అగ్రగామిగా నిలిచింది.


More Telugu News