సముద్రాన్నే మింగేస్తున్నట్టుండే ‘థోర్స్​ వెల్​’.. సముద్రపు ఒడ్డున చిత్రమైన నిర్మాణం.. వీడియో ఇదిగో

  • అమెరికాలో ఓరెగాన్ సమీపంలోని కేప్ పర్పెట్యువా ప్రాంతంలో సహజ నిర్మాణం
  • సముద్ర తీరంలో రాళ్ల మధ్య బావి.. అలలతో వచ్చిన నీరంతా దానిలోకే..
  • నిజానికి అదో పెద్ద గుహ పైభాగమని చెబుతున్న నిపుణులు
  • నీరంతా తిరిగి సముద్రంలోకి వెళుతుందని వెల్లడి
అదో పెద్ద బావి లాంటి నిర్మాణం.. సముద్ర తీరంలోనే రాళ్ల కుప్పల మధ్య ఉంటుంది. సముద్రం పోటెత్తి అలలు వచ్చినప్పుడల్లా ఆ బావిపై దాకా నీళ్లు వస్తాయి. అందులోకి వెళ్లిన నీళ్లన్నీ అటే లోపలికి వెళ్లిపోతాయి. ఇలా సముద్రం నుంచి ఎన్ని నీళ్లు వస్తున్నా.. బావి మాత్రం నిండదు. అందులోకి వెళ్లిన నీళ్లు పైకి కనబడవు. అంతా చిత్రంగా అనిపిస్తోంది కదా. అమెరికాలోని ఓరెగాన్ సమీపంలోని కేప్ పర్పెట్యూవా సముద్ర తీరంలో ఈ నిర్మాణం ఉంది. అసలు లోతెంతో తెలియనట్టుగా, నీళ్లన్నీ మింగేస్తోందని దీనికి ‘థోర్స్ వెల్’ అని పేరు పెట్టారు. 

ఏమిటీ బావి.. నీళ్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి?
  • నిజానికి ఈ థోర్స్ వెల్ లోకి వెళ్తున్న నీళ్లన్నీ తిరిగి సముద్రంలోకే వెళ్తున్నట్టు నిపుణులు గుర్తించారు. అదెలాగంటే బావి ఉన్న చోటు, ఆ చుట్టు పక్కల ప్రాంతమంతా బసాల్ట్ రాతి శిలలతో నిండి ఉంటుంది.
  • ఈ రాతి పొరల దిగువన సముద్రాన్ని అనుసంధానిస్తూ గుహలు ఉన్నాయని.. సముద్రంలో నుంచి నీళ్లు ఈ గుహల్లోకి వస్తూ పోతూ ఉంటాయని చెబుతున్నారు. లక్షల ఏళ్లుగా సముద్రపు అలల తాకిడికి రాతి పొరల మధ్య గుహలు ఏర్పడటం సాధారణమేనని.. ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల అలాంటి గుహలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు.  
  • అలాంటి గుహల్లో ఒకదాని పైకప్పు కొంత భాగం కూలిపోయి.. ఇలా బావిలా ఏర్పడిందని నిపుణులు వివరిస్తున్నారు. పైభాగంలో రంధ్రం సుమారు మూడున్నర మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇక దీని లోతు మహా అయితే ఆరేడు మీటర్లు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు.
  • బావి చిన్నగానే ఉన్నా నిరంతరం ఆటుపోట్లతో యాక్టివ్ గా ఉంటుండటం, లోపల గుహ ఎలా ఉందో, ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితిలో ప్రమాదకరమని ఎవరూ ప్రయత్నం చేయలేదు.
  • సముద్రం ఆటుపోట్లకు గురైనప్పుడు నీటి మట్టం పెరిగి ఈ బావి వరకు నీరు వస్తుంది. అలలు వచ్చినప్పుడల్లా నీరంతా ఈ బావిలో పడిపోతుంటుంది. తెల్లగా పాల నురగలా ఎగసిపడుతూ ఉంటుంది.
  • అలలు వెనక్కి వెళ్లేటప్పటికి బావిలో చేరిన నీరంతా లోపలికి ఇంకిపోయినట్టు అవుతుంది. మళ్లీ అలలు వచ్చినప్పుడు నీరు నిండటం, లోపలికి వెళ్లిపోతుండటం జరుగుతూనే ఉంటుంది. దీనితో ఈ బావిని ‘డ్రెయిన్ పైప్ ఆఫ్ పసిఫిక్’ అని కూడా పిలుస్తుంటారు.
  • ఈ దృశ్యం చూడటానికి ఎంతో బాగుండటంతో చాలా మంది పర్యాటకులు థోర్ వెల్ ను సందర్శించడానికి వస్తుంటారని పర్యాటక శాఖ అధికారులు చెబుతున్నారు.


More Telugu News