శాశ్వత వీసాల సంఖ్యను మరింత పెంచిన ఆస్ట్రేలియా

  • కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు
  • నష్ట నివారణకు ఉపక్రమించిన దేశాలు
  • విదేశీ వృత్తి నిపుణులకు పెరిగిన డిమాండ్
  • ద్వారాలు తెరిచిన ఆస్ట్రేలియా
  • వలసదారుల వీసాలను 1.95 లక్షలకు పెంపు
కరోనా సంక్షోభం కలిగించిన నష్టాల నుంచి వీలైనంత త్వరగా కోలుకునేందుకు ప్రపంచ దేశాలు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ద్వారాలు తెరుస్తున్నాయి. గతంలో ఉన్న వీసా నిబంధనలను సడలిస్తూ వీలైనంత ఎక్కువమందిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా, ఆస్ట్రేలియా శాశ్వత వలసదారుల వీసాల సంఖ్యను మరింత పెంచింది. 

ఇప్పటిదాకా ఏడాదికి 35 వేల వీసాలు మంజూరు చేస్తున్న ఆస్ట్రేలియా ప్రభుత్వం... ఇప్పుడా వీసాల సంఖ్యను ఏకంగా 1.95 లక్షలకు పెంచింది. సుదీర్ఘకాలం పాటు ఆస్ట్రేలియాలో నైపుణ్య సేవలు అందించేందుకు ఈ కొత్త వీసా విధానం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 

కరోనా సంక్షోభం తలెత్తగానే, ముందుగా జాగ్రత్తపడిన దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. చైనాలో కరోనా వెలుగుచూసిన కొన్నినెలల్లోనే ఆస్ట్రేలియా తన సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. కఠిన ఆంక్షలు విధించి కరోనాను సమర్థంగా ఎదుర్కొంది. అయితే రెండేళ్ల పాటు ప్రపంచదేశాలతో సంబంధాలు లేకుండా గడిపిన ఆస్ట్రేలియా తీవ్ర నష్టాలు చవిచూసింది. 

ముఖ్యంగా, మానవ వనరుల కొరతను భారీ స్థాయిలో ఎదుర్కొంది. ఆసుపత్రుల్లో నర్సులు, వివిధ సంస్థల్లో ఇంజినీర్లు లేని పరిస్థితి ఆస్ట్రేలియాలో దర్శనమిచ్చింది. దాంతో ఇప్పుడక్కడ వేలాదిమంది వృత్తినిపుణుల అవసరం ఉంది. 

ఆస్ట్రేలియాలో నిరుద్యోగిత 50 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుని 3.4 శాతంగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా వేతనాలు తగ్గిపోయాయి.  ఏటా 1.60 లక్షల మందికి వీసాలు ఇచ్చేలా నిబంధనలు సడలించాలని వ్యాపార సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. తాత్కాలికంగానైనా ఖాళీలను భర్తీ చేసుకునేందుకు వీసాల సంఖ్యను పెంచాలని కోరాయి. 

ఆస్ట్రేలియాలో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం వ్యాపారవర్గాలతో కాన్ బెర్రాలో రెండు రోజుల సదస్సు నిర్వహించగా, విదేశీ నిపుణులను ఆకర్షించే విషయంపై చర్చించారు. ఇప్పటికే వివిధ రంగాల నిపుణులను రాబట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, సింగపూర్, హాంకాంగ్, యూఏఈలతో ఆస్ట్రేలియాకు పోటీ తప్పడంలేదు.


More Telugu News