గాయంతో ఆసియా కప్ కు దూరమైన రవీంద్ర జడేజా

  • కుడి మోకాలి గాయంతో బాధపడుతున్న జడేజా
  • మిగిలిన మ్యాచ్ లకు అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడి
  • జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ఎంపిక
  • పాక్ పై విజయంలో కీలకభూమిక పోషించిన జడేజా
ఆసియా కప్ లో ఆడుతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయంతో టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన జడేజా తాజాగా కుడి మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. దాంతో, ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్ లకు జడేజా అందుబాటులో ఉండడని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం అతడు బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నాడని బోర్డు కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపారు. ఇక, జడేజా స్థానంలో అక్షర్ పటేల్ ను జట్టులోకి ఎంపిక చేసినట్టు వివరించారు. 

ఆసియా కప్ టోర్నీలో టీమిండియా స్టాండ్ బై ఆటగాళ్లలో అక్షర్ పటేల్ కూడా ఒకడు. జడేజా తరహాలోనే అక్షర్ పటేల్ కూడా అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ రాణించగలడు.

ఆసియా కప్ లో రెండు వరుస విజయాలతో టీమిండియా ఇప్పటికే సూపర్-4 దశ చేరుకుంది. భారత్ తన తదుపరి మ్యాచ్ ను సెప్టెంబరు 4న ఆడనుంది. ఈ మ్యాచ్ లో భారత్ తో తలపడే ప్రత్యర్థి ఇంకా ఖరారు కాలేదు.


More Telugu News