అనారోగ్యంతో బాధపడుతున్న 'పద్మశ్రీ' విజేతతో ఆసుపత్రిలో బలవంతంగా డ్యాన్స్ చేయించిన సామాజిక కార్యకర్త

  • ఒడిశాలోని కటక్ లో అమానవీయ ఘటన
  • సేంద్రియ వ్యవసాయ రంగంలో కృషి చేసిన కమలా పూజారి
  • 2019లో పద్మశ్రీ పురస్కారం
  • ఇటీవల కిడ్నీ సంబంధ వ్యాధితో అనారోగ్యం
  • ఐసీయూలో చికిత్స
ఒడిశాలోని కటక్ నగరంలో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న పద్మశ్రీ విజేత కమలా పూజారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఓ సామాజిక కార్యకర్త ఆమెతో బలవంతంగా డ్యాన్స్ చేయించిన వైనం వెల్లడైంది. 71 ఏళ్ల కమలా పూజారి సేంద్రియ వ్యవసాయంలో ఎంతో కృషి చేశారు. దేశీయంగా 100కి పైగా రకాల వంగడాలను ఆమె పరిరక్షించారు. ఆర్గానిక్ వ్యవసాయం వ్యాప్తి కోసం ఆమె పాటుపడిన తీరును గుర్తించిన కేంద్రం 2019లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 

అయితే, కమలా పూజారి ఇటీవల కిడ్నీ సంబంధ వ్యాధితో కటక్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే, మమతా బెహరా అనే సామాజిక కార్యకర్త ఆసుపత్రిలో కమలా పూజారితో బలవంతంగా డ్యాన్స్ చేయించింది. తన ఆరోగ్యం బాగాలేదని, తాను డ్యాన్స్ చేయలేనని కమలా పూజారి చెబుతున్నా వినకుండా, ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

ఈ నేపథ్యంలో, కమలా పూజారి సొంత సామాజిక వర్గం పరజ గిరిజనులు మండిపడుతున్నారు. సామాజిక కార్యకర్త మమత బెహరాపై చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంపై పద్మశ్రీ కమలా పూజారి స్పందించారు. తాను డ్యాన్స్ చేయాలని అనుకోలేదని, కానీ బలవంతంగా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. డ్యాన్స్ చేయలేనని ఎంత మొత్తుకున్నా ఆ సామాజిక కార్యకర్త వినలేదని, ఆరోగ్యం దెబ్బతినడంతో నీరసించిపోయానని తెలిపారు. 

కాగా, ఆ సామాజిక కార్యకర్తపై చర్యలు తీసుకోకపోతే వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతామని పరజ గిరిజన సంఘం అధ్యక్షుడు హరీశ్ ముదులి ప్రభుత్వానికి స్పష్టం చేశారు.


More Telugu News