బీచ్ లో వాలీబాల్ ఆడుతూ.. సముద్రంలో సర్ఫింగ్ చేస్తూ సేదతీరిన టీమిండియా ప్లేయర్లు

  • బుధవారం హాంకాంగ్ పై గెలిచిన భారత్
  • ఈ నెల 4వ తేదీన తదుపరి మ్యాచ్ లో తలపడనున్న రోహిత్ సేన
  • గురువారం ప్రాక్టీస్ కు దూరంగా ఉండి ఎంజాయ్ చేసిన ఆటగాళ్లు
ఆసియా కప్ లో వరుసగా రెండు విజయాలతో సూపర్4 రౌండ్ కు అర్హత సాధించిన టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 4వ తేదీన ఆడనుంది. ఈ నేపథ్యంలో లభించిన విరామాన్ని భారత ఆటగాళ్లు ఆస్వాదిస్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తదితర ప్లేయర్లంతా దుబాయ్ బీచ్ లో గురువారం సాయంత్రం వాలీబాల్ ఆడుతూ, నీళ్లలో సర్ఫింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

‘ప్రాక్టీస్ కు సెలవు దినం కాబట్టి ద్రవిడ్ సర్ మాకోసం కొన్ని సరదా కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటిలో మేం చాలా ఉత్సాహంగా పాల్గొని రిలాక్స్ అయ్యాం. మేం చాలా ఎంజాయ్ చేశాము. ప్రతి ఒక్కరూ ఎంత సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారో మీరు చూడవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు ఆటగాళ్ల మధ్య బాండింగ్ ను ఏర్పాటు చేయడంలో సహాయపడుతుంది’ అని స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ వీడియోలో పేర్కొన్నాడు.

ఆసియా కప్ గ్రూప్-ఎ తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఉత్కంఠ విజయం సాధించిన భారత్ బుధవారం జరిగిన రెండో పోరులో 40 పరుగుల తేడాతో హాంకాంగ్ పై గెలిచింది. ఈ మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. శుక్రవారం రాత్రి హాంకాంగ్ తో జరిగే మ్యాచ్ లో గెలిస్తే పాకిస్థాన్ గ్రూప్-ఎ నుంచి సూపర్4కి చేరుకుంటుంది. అప్పుడు ఈ నెల 4న జరిగే సూపర్ 4 మ్యాచ్ లో పాక్ తో భారత్ తలపడుతుంది. 6న ఆఫ్ఘనిస్థాన్, 8న శ్రీలంకతో పోటీ పడుతుంది. ఈ నెల 11న ఫైనల్ జరుగుతుంది.


More Telugu News