ఆన్ లైన్ లోనే లెర్నర్స్ లైసెన్స్ తీసుకోవచ్చు!

  • కేంద్ర రవాణా శాఖ పోర్టల్ సదుపాయం
  • రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని, ఆధార్ సాయంతో దరఖాస్తు
  • ఆన్ లైన్ లోనే టెస్ట్ లేదంటే ఆర్టీవో కార్యాలయానికి
భారతీయ పౌరులు ఎవరైనా మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 4 కింద లెర్నర్స్ లైసెన్స్ కు అర్హులు. 16 ఏళ్లు నిండిన వారు ఎవరైనా లెర్నర్స్ లైసెన్స్ తీసుకోవచ్చు. అది కూడా గేర్లు లేని ద్విచక్ర వాహనం, ఇంజన్ సామర్థ్యం 50సీసీ మించకుండా ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుడి అనుమతి ఉండాలి.

పర్మినెంట్ లైసెన్స్ కోసం అయితే రవాణా శాఖ కార్యాలయంకు వెళ్లాలి. పరీక్షల్లో పాస్ కావాలి. లెర్నర్స్ లైసెన్స్ కోసం అయితే ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకుని, టెస్ట్ రాసి తీసుకోవచ్చు. లెర్నర్స్ లైసెన్స్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేశారు. 

ముందుగా కేంద్ర రవాణా, రహదారుల శాఖ పోర్టల్ https://sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do కు వెళ్లాలి. అక్కడ దరఖాస్తుదారు తన రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. జాబితాలో తెలంగాణ లేదు. ఆంధప్రదేశ్ అయితే ఉంది. ఆంధప్రదేశ్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. మొదట్లోనే ‘అప్లయ్ ఫర్ లెర్నర్స్ లైసెన్స్’ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేయాలి. 
 అనంతరం అప్లికెంట్ విత్ ఆధార్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. ఆధార్ నంబర్ ఇచ్చి, మొబైల్ కు వచ్చే ఓటీపీని నమోదు చేయాలి. అక్కడ ఉండే ఆప్షన్లకు టిక్ చేయాలి. అంటే ఆధార్ ఆథెంటికేషన్ కు అంగీకారం తెలుపుతున్నట్టు. అనంతరం కింద ఆథెంటికేట్ దగ్గర సబ్ మిట్ చేయాలి. 

తర్వాత పేజీలో దరఖాస్తుదారుని ఆధార్ డేటా బేస్ లోని వివరాలు కనిపిస్తాయి. టెస్ట్ కోసం రవాణా కార్యాలయం లేదా హోమ్ ను ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత లెర్నర్స్ లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లెర్నర్స్ టెస్ట్ ను పూర్తి చేయాలి. దీనికంటే ముందు 10 నిమిషాల సూచనలతో కూడిన వీడియోను చూస్తే టెస్ట్ ను సులభంగా పూర్తి చేయవచ్చు.


More Telugu News