ఇటీవలి గుండె వైఫల్యాల వెనుక ‘కరోనా’ కోణం?
- కరోనా వైరస్ తో వెలుగు చూసిన గుండె జబ్బులు
- గుండె పనితీరుపై వైరస్ ప్రభావం
- అప్పటికే సమస్య ఉన్నవారికి కరోనాతో పెరిగే రిస్క్
గుండె వైఫల్యాలు, హార్ట్ ఎటాక్ కేసులు గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా చిన్న వయసు వారిలోనూ ఇవి కనిపిస్తున్నాయి. దీనికి కరోనా వైరస్ కూడా కారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా కరోనా వైరస్ శ్వాస కోస వ్యవస్థ, ఊపిరితిత్తులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని మనకు తెలుసు. కానీ, గుండెపైనా బలమైన ప్రభావం పడుతోందని చెబుతున్నారు.
వైరస్ మన కణాల్లోకి ప్రవేశించేందుకు ఉపయోగించుకునే కీలకమైన ప్రొటీన్ ‘ఏసీఈ2’ గుండెపై ప్రభావం చూపిస్తున్నట్టు ప్రస్తావిస్తున్నారు. వైరస్ ఈ ప్రొటీన్ కే అతుక్కుంటుంది. మానవుల్లోని డజన్ల కొద్దీ కణాలపై ఈ ప్రొటీన్ ను గుర్తించొచ్చని ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన సైన్స్ జర్నల్ ‘నేచుర్’ పేర్కొంది.
ముందు నుంచి గుండె వ్యాధులు ఉన్న వారిలో కరోనా వైరస్ అభివృద్ధి చెందితే వారికి గుండె వైఫల్య ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు వైద్యులు స్వయంగా తెలుసుకున్నారు. ఈ తరహా రోగుల్లో రక్తపోటు, మధుమేహం, గుండె సమస్య, మూత్రపిండాల సమస్యలు, వృద్ధాప్యం ఇలా కోమార్బిడిటీలు ఉండొచ్చని చెబుతున్నారు. దీంతో ఇటువంటి వారికి కరోనా వైరస్ సోకడం వల్ల హార్ట్ ఎటాక్, ఉన్నట్టుండి గుండె ఆగిపోవడం, గుండె జబ్బులు ఎదురవుతాయని వైద్యులు వివరిస్తున్నారు.
ఎంతో మంది రోగుల్లో కరోనా వైరస్ తోపాటు గుండె జబ్బులు కూడా బయటపడినట్టు వైద్యులు తమ అనుభవం ఆధారంగా చెబుతున్నారు. అప్పటి వరకు గుండె జబ్బులు ఉన్నట్టు తెలియని వారు కూడా చాలా ముందే ఉన్నారన్నది వైద్యులు తెలుసుకున్న విషయం. కరోనా వైరస్ బారిన పడిన తర్వాత, ఆ వైరస్ గుండెపైనా ప్రభావం చూపించడంతో వారు వైద్యులను ఆశ్రయించడం, గుండె సమస్యలు వెలుగు చూడడం కనిపించింది. దీనికితోడు, కరోనా వైరస్ కారణంగా గుండె పనితీరులో మార్పులు, హృదయ స్పందనల్లో హెచ్చుతగ్గులు నమోదైన కేసులు కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకని గుండెకు సంబంధించి ఒక్కసారి పూర్తి స్థాయి స్క్రీనింగ్ చేయించుకోవడం ఒక్కటే ముందస్తు రక్షణ అవుతుంది.