బాలీవుడ్ సినిమా చూసి వికలాంగుడిని హత్య చేసిన మైనర్

  • దక్షిణ ఢిల్లీలో ఓ ఇంట్లో పనివాడిగా చేరిన 17 ఏళ్ల బాలుడు
  • అదే ఇంట్లో దొంగతనం చేస్తుండగా చూసిన వికలాంగుడిని చంపి పరారు
  • ‘తు చోర్ మెయిన్ సిపాహి’ సినిమా ప్రేరణతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి
బాలీవుడ్ సినిమాను చూసి ప్రేరణ పొందిన ఓ మైనర్ అచ్చం ఆ సినిమాలో మాదిరిగా ఒక వికలాంగ యువకుడిని హత్య చేసిన ఘటన దక్షిణ ఢిల్లీలో చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులు 17 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మైనర్ నిందితుడు దక్షిణ ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో ఓ ఇంట్లో  మూడు నెలల నుంచి పని చేస్తున్నాడు. ఆ ఇంట్లో ఒక వికలాంగ యువకుడు కూడా ఉన్నాడు. 

ఒక రోజు ఓనర్లు గుడికి వెళ్లిన సమయంలో మైనర్ బాలుడు ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. ఇది చూసిన వికలాంగుడు అలారం నొక్కాడు. దాంతో తాను దొరికిపోతానని భావించిన మైనర్ ఆ వికలాంగ యువకుడిని హత్య చేసి పారిపోయాడు. బాలుడు బాలీవుడ్ చిత్రం ‘తు చోర్ మెయిన్ సిపాహి’ నుంచి ప్రేరణ పొందాడని పోలీసు అధికారి తెలిపారు. మైనర్ నిందితుడు సినిమాలో చూపిన విధంగా బ్లాక్ కలర్ గ్లోవ్స్‌ను కూడా స్పాట్‌లో వదిలిపెట్టాడని పోలీసులు తెలిపారు.  

దొంగతనం, హత్య చేసి బీహార్‌లోని తన స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నించిన బాల నేరస్థుడు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి నుంచి చోరీకి గురైన నగలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో క్లీనింగ్ పనులు చేయడం అవమానంగా భావించి, అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నట్లు నిందితుడు చెప్పాడు. స్వగ్రామం వెళ్లే ముందు ఇంటిని దోచుకోవాలని ప్లాన్ చేశాడు. కానీ, దొంగతనం చేస్తుండగా చూసిన వికలాంగ యువకుడు అలారం మోగించడంతో అతడిని చంపినట్లు ఒప్పుకున్నాడు.


More Telugu News