కొనుక్కున్నానంటూ రాజధాని రోడ్డును తవ్వేసి.. కంకరను ఎత్తుకెళ్లిన అమరావతి రైతు!

  • శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లేందుకు రోడ్డు వేసిన గత ప్రభుత్వం
  • కొనుక్కున్నానంటూ తవ్వేసిన పెనుమాక రైతు
  • విచారణ జరిపిన రెవెన్యూ అధికారి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన తహసీల్దార్
అమరావతి రైతు ఒకరు రాజధాని రోడ్డును తవ్వేసి కంకరను తరలించుకుపోయాడు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. రాజధాని శంకుస్థాపన ప్రదేశానికి వెళ్లేందుకు గత ప్రభుత్వం ఓ కంకర రోడ్డు వేసింది. తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన రైతు గోవిందరెడ్డి ఆ రోడ్డును తవ్వేసి ట్రాక్టర్ల ద్వారా కంకరను తరలించాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు గురువారం విచారణ జరిపారు.

రెవెన్యూ ఆర్ఐ ప్రశాంతి సిబ్బందితో కలిసి తవ్వేసిన రోడ్డును పరిశీలించారు. అనంతరం రైతును కలిసి వివరణ తీసుకున్నారు. తాను ఆ పొలాన్ని కొనుగోలు చేశానని, అందుకనే చదును చేసుకున్నానని రైతు వివరణ ఇచ్చాడు. తరలించిన కంకరను గ్రామంలో ప్రజా అవసరాలకు వినియోగించినట్టు చెప్పుకొచ్చాడు. ఆయన వివరణతో నివేదిక తయారుచేసిన ఆర్ఐ ప్రశాంతి తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డికి దానిని అందజేశారు. రైతు గోవిందరెడ్డిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.


More Telugu News