అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. పేలిపోయిన గ్యాస్ సిలిండర్ లారీ

  • కర్నూలు నుంచి నెల్లూరుకు బయలుదేరిన లారీ
  • క్యాబిన్‌లో మంటలు రావడంతో అప్రమత్తమై వాహనాన్ని నిలిపేసిన డ్రైవర్
  • ఆ వెంటనే అటుఇటు రాకపోకలు నిలిపివేసిన వైనం
  • సమీప గ్రామంలోని ఇళ్లను ఖాళీ చేయించిన పోలీసులు
  • అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
300కుపైగా గ్యాస్ సిలిండర్లను మోసుకెళ్తున్న లారీ ఒక్కసారిగా పేలిపోయింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ వద్ద అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గత అర్ధరాత్రి జరిగిందీ ఘటన. కర్నూలు నుంచి శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడుకు 300కు పైగా భారత్ గ్యాస్ సిలిండర్లతో ఓ లారీ బయలుదేరింది. దద్దవాడ వద్ద క్యాబిన్‌లో మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ మోహన్‌రావు వెంటనే లారీ ఆపి కిందికి దిగాడు. సిలిండర్లు పేలే ప్రమాదం ఉందని గ్రహించి రహదారిపై అటుఇటు వాహనాలను నిలిపివేశారు. ఆ తర్వాత కాసేపటికే లారీలోని సిలిండర్లు పేలడం మొదలైంది.

మరోవైపు, సమాచారం అందుకున్న హైవే పోలీసులు ఘటన ప్రాంతానికి సమీపంలో ఉన్న దద్దవాడలోని 30 ఇళ్లను ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శకటం వచ్చినప్పటికీ సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోతుండడంతో దగ్గరి వరకు వెళ్లలేకపోయింది. దూరం నుంచే మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. భారీ శబ్దంతో సిలిండర్లు పేలుతుండడంతో సమీప గ్రామాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపు 100 సిలిండర్లు పేలిపోయాయి. పోలీసులు, లారీ డ్రైవర్ అప్రమత్తత కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


More Telugu News