మరొకరిని ఫామ్ లోకి తీసుకురావాలని సూర్యకుమార్ ఫామ్ తో ఆడుకోవద్దు: గంభీర్

  • ఫామ్ లో లేక తంటాలు పడుతున్న కోహ్లీ
  • హాంకాంగ్ పై విరుచుకుపడిన సూర్యకుమార్
  • కోహ్లీ తర్వాత బ్యాటింగ్ కు దిగి అతడిని మించిపోయిన సూర్య
  • సూర్య ఫామ్ ను ఉపయోగించుకోవాలన్న గంభీర్
  • సూర్యను 3వ స్థానంలో పంపించాలని సూచన
ముంబయి బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ తిరుగులేని ఫామ్ లో ఉండడం తెలిసిందే. బౌలర్ ఎవరైనా సరే, ఆడేది ఏ జట్టుపై అయినా సరే... సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ను తాకితే ఆ బంతి బౌండరీ దాటాల్సిందే. 

నిన్న హాంకాంగ్ జట్టుపై ఆసియాకప్ లోనూ సూర్యకుమార్ తన విధ్వంసక ఫామ్ కొనసాగించాడు. తన కంటే ముందు బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీని మించిపోయి ఆడాడు. కోహ్లీ సింగిల్స్, డబుల్స్ తీస్తూ నెట్టుకొస్తుంటే... సూర్య ఫోర్లు, సిక్సర్లతో హాంకాంగ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.

సూర్యకుమార్ ను 4వ స్థానంలో కాకుండా, 3వ స్థానంలో బ్యాటింగ్ కు పంపాలని సూచించాడు. "నేనీ మాట చెప్పడానికి తగిన కారణం ఉంది. మరొకరిని ఫామ్ లోకి తీసుకువచ్చేందుకు ఇంకొకరి ఫామ్ తో ఆడుకోవద్దు. ఇంగ్లండ్ గడ్డపై అందరూ విఫలమైన చోట సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఆడాడు. వెస్టిండీస్ పర్యటనలోనూ అదరగొట్టాడు. 

ఇప్పుడతని వయసు 30కి పైనే. అతడి వయసేమీ 21, 22 కాదు. ఇంకెంతో కాలం అతడి కెరీర్ సాగకపోవచ్చు. అందుకే సాధ్యమైనంత ఎక్కువగా అతడికి ఆడే ఆవకాశం ఇవ్వండి. అతడి ఫామ్ ను ఉపయోగించుకోండి. 

విరాట్ కోహ్లీ అంటారా... అతడిప్పటికే చాలా అనుభవం సంపాదించాడు. పరిస్థితులకు తగిన విధంగా 4వ స్థానంలో ఆడగలడు. సూర్యకుమార్ యాదవ్ ను 3వ స్థానంలో బరిలో దింపాలన్నదే నా అభిప్రాయం. కనీసం టీ20 వరల్డ్ కప్ వరకైనా అతడిని ఆ స్థానంలో ఆడించండి... ఫలితాలు ఎలా ఉంటాయో చూడండి" అని గంభీర్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు.


More Telugu News