ఇప్పటి యువతరం దృష్టిలో 'వైఫ్' అంటే ఏంటో చెప్పిన కేరళ హైకోర్టు

  • విడాకులు కోరిన 51 ఏళ్ల వ్యక్తి
  • తిరస్కరించిన న్యాయస్థానం
  • వాడిపారేసే ధోరణి ఎక్కువైందన్న కోర్టు
  • పెళ్లంటే స్వేచ్ఛకు ముగింపు అనుకుంటున్నారని విమర్శ
ఓ మధ్య వయస్కుడు దాఖలు చేసిన విడాకుల దరఖాస్తును తిరస్కరించే క్రమంలో కేరళ హైకోర్టు పెళ్లి, భార్య తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 51 ఏళ్ల వ్యక్తికి 2017 నుంచి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉంది. భార్యతో వేగలేక విడాకులు కోరుతున్నట్టు అతడు తన దరఖాస్తులో పేర్కొన్నాడు. వైవాహిక క్రూరత్వం కింద పరిగణించి తనకు విడాకులు మంజూరు చేయాలని కోరాడు. 

అయితే, భార్య మాత్రం అతడి నుంచి విడిపోలేనని, తనకు ముగ్గురు కుమార్తెలని పేర్కొంది. దీనిపై కోర్టు స్పందిస్తూ, వారిద్దరూ కలిసి తమ వైవాహిక జీవితాన్ని కొనసాగించేందుకు అవకాశాలు మూసుకుపోయాయని చెప్పలేం అని వ్యాఖ్యానించింది. అంతేకాదు, ఆ వ్యక్తి విడాకుల దరఖాస్తును తోసిపుచ్చింది. 

ఈ సందర్భంగా జస్టిస్ ఏ.మహ్మద్ ముస్తాక్, జస్టిస్ సోఫీ థామస్ లతో కూడిన డివిజన్ బెంచ్ పలు వ్యాఖ్యలు చేసింది. వస్తువులను వాడిపారేసే వినియోగదారుల బుద్ధిని వైవాహిక జీవితంలోనూ చూపిస్తున్నారంటూ బెంచ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ తరహా యూజ్ అండ్ త్రో ఆలోచనా విధానం వైవాహిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తోందని పేర్కొంది. సహజీవన సంబంధాలు ఎక్కువైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పటి యువతరం మరీ విపరీత ధోరణుల్లో ఆలోచిస్తోందని, పెళ్లంటే వారికి ఓ భూతంలా మారిపోయిందని విమర్శించింది. ఎటువంటి బాధ్యతలు లేని స్వేచ్ఛా జీవితానికి పెళ్లి ముగింపు పలుకుతుందన్న భావన కుర్రకారులో ఉందని, WIFE అంటే వారి దృష్టిలో Worry Invited For Ever (ఎడతెగని బాధను జీవితంలోకి ఆహ్వానించడం) అనుకుంటున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది.


More Telugu News