కోహ్లీ మనసు గెలిచిన హాంకాంగ్ ప్లేయర్లు.. ఏం చేశారంటే!

  • తమ జెర్సీని కోహ్లీకి జ్ఞాపికగా ఇచ్చిన హాంకాంగ్
  •  జెర్సీపై ప్రత్యేక సందేశం రాసిన ఆటగాళ్లు
  • ఒక తరానికి స్ఫూర్తిగా నిలిచావంటూ కోహ్లీకి కృతజ్ఞతలు
హాంకాంగ్ క్రికెటర్లు భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మనసు గెలిచారు. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో భారత్ చేతిలో హాంకాంగ్ 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారీ టార్గెట్ ఛేజింగ్ లో హాంకాంగ్ బాగానే పోరాడి ఆకట్టుకుంది. ఆ తర్వాత హాంకాంగ్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ మనసు గెలిచుకున్నారు. 

మ్యాచ్ ముగిసిన తర్వాత హాంకాంగ్ ప్లేయర్లంతా సంతకాలు చేసిన జెర్సీని విరాట్ కోహ్లీకి బహుమతిగా ఇచ్చారు. ‘విరాట్, ఒక తరానికి స్ఫూర్తినిచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మేము మీ వెన్నంటే ఉంటాము. మీకు మరెన్నో అద్భుతమైన రోజులు ముందున్నాయి. ప్రేమతో మీ టీమ్ హాంకాంగ్’ అని జెర్సీపై రాశారు. 

ఈ జెర్సీని కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘హాంకాంగ్ టీమ్ కు థ్యాంక్స్. మీ ప్రేమ ఎంతో మధురమైనది’ అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సత్తా చాటాడు. 44 బంతుల్లోనే ఒక ఫోర్, మూడు సిక్సర్లతో అజేయంగా 59 పరుగులు చేసిన కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. దాంతో, ఈ ఫార్మాట్ లో అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును సమం చేశాడు. కోహ్లీకి తోడు సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్) మెరుపు హాఫ్ సెంచరీతో ఈ మ్యాచ్ లో భారత్ రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. తర్వాత హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులే చేసి ఓడిపోయింది.


More Telugu News