గణపతికి సీట్ బెల్ట్ పెట్టి ప్రకటన విడుదల చేసిన మహీంద్రా అండ్ మహీంద్రా

  • మహీంద్రా ట్రక్ డ్రైవర్ పక్క సీట్లో వినాయకుడి విగ్రహం
  • విగ్రహానికి సీట్ బెల్ట్ పెట్టిన డ్రైవర్
  • సీట్ బెల్ట్ ప్రాధాన్యాన్ని తెలియజెప్పేందుకు కొత్త ప్రయత్నం
సీట్ బెల్ట్ ప్రాధాన్యాన్ని వాహనదారుల్లో చాలా మంది అర్థం చేసుకోరు. సీట్ బెల్ట్ ధరిస్తే ప్రమాదాల్లో చాలా వరకు రక్షణ ఉంటుందన్న విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. పోలీసులు చలాన్లు విధించినా పట్టించుకోని వారే ఎక్కువ. అయినా, సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు, సంస్థలు.. సీట్ బెల్ట్, హెల్మెట్ ప్రాధాన్యం తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఇదే పని చేసింది.

ప్రస్తుతం గణేశ్ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో వినాయకుడి రూపంలో సీట్ బెల్ట్ గురించి చెప్పే ప్రకటనను మహీంద్రా అండ్ మహీంద్రా విడుదల చేసింది. ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా ట్రక్ డ్రైవర్.. గణపతి బొమ్మను తన ట్రక్ లో తీసుకెళుతుంటాడు. తన పక్క సీట్లో వినాయకుడి విగ్రహాన్ని కూర్చోబెట్టి, సీట్ బెల్ట్ పెట్టేస్తాడు. 

దీన్ని చూసిన ఢిల్లీ టీచర్ మను గులాటీ.. ‘‘గణపతి సీట్ బెల్ట్ ధరించడాన్ని ఎవరైనా చూశారా? రహదారి భద్రతా నియమాలను అనుసరించాలని గుర్తు పెట్టుకోండి. అద్భుతమైన వీడియో ఇది’’ అని ట్వీట్ చేశారు. దీనికి మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘‘మీకు చురుకైన మనోనేత్రం ఉంది. నిజమే, ఆ వీడియో ఉద్దేపూర్వకంగా రూపొందించినదే’’ అని ట్వీట్ ఇచ్చారు.


More Telugu News