ఆసియాకప్: గెలిచిన ఇండియా, ఓడిన పాక్ జట్లకు భారీ జరిమానా!

  • భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్
  • తప్పిదాన్ని అంగీకరించిన ఇరు జట్ల కెప్టెన్లు
  • మ్యాచ్ ఫీజులో 40 శాతాన్ని జరిమానాగా విధించిన ఐసీసీ
ఆసియాకప్‌లో భాగంగా ఈ నెల 28న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ కారణంగా గెలిచిన టీమిండియాకు, ఓడిన పాకిస్థాన్ జట్టుకు ఐసీసీ భారీ జరిమానా విధించింది. వారి మ్యాచ్‌ ఫీజులో ఏకంగా 40 శాతం కోత విధించింది. ఇరు జట్లు తమ ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయడంలో విఫలమైనట్టు మ్యాచ్ రిఫరీ నివేదించారు. దీంతో ఇరు జట్ల మ్యాచ్‌ ఫీజులో కోత విధిస్తూ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ నిర్ణయం తీసుకుంది. 

ఐసీసీ నియమావళి ప్రకారం తమకు కేటాయించిన సమయానికి ఒక్క ఓవర్ జాప్యమైతే మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. భారత్-పాక్ జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, బాబర్ ఆజం తమ తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేదని ఐసీసీ పేర్కొంది. కాగా, ఆసియాకప్‌లో భాగంగా నేడు భారత్-హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి.


More Telugu News