ఇంతకంటే పెద్ద పుకారు ఇంకేదైనా ఉంటుందా అనిపించింది: జడేజా

  • టీమిండియాలో విలువైన ఆటగాడిగా జడేజా
  • ఆల్ రౌండర్ కు పర్యాయపదంలా మారిన సౌరాష్ట్ర ఆటగాడు
  • పుకార్లు తనకు కొత్త కాదన్న జడేజా
  • ఓసారి తాను చనిపోయానంటూ ప్రచారం జరిగిందని వెల్లడి
  • వదంతులను తాను పట్టించుకోనని స్పష్టీకరణ
టీమిండియాకు లభించిన ఆణిముత్యాల్లాంటి ఆల్ రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్... అన్నింట్లోనూ విశేష ప్రతిభ కనబరుస్తూ జట్టుకోసం నూటికి నూరుశాతం కృషి చేసే జడేజా వంటి ఆటగాడు ఉండడం ఏ జట్టుకైనా అదనపు బలం. మొన్న టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఆసియాకప్ లో జరిగిన మ్యాచ్ జడేజా వీరోచిత బ్యాటింగ్ ప్రదర్శనకు వేదికగా నిలిచింది. హార్దిక్ పాండ్యాతో కలిసి జడేజా ధాటిగా ఆడుతూ జట్టును గెలుపుబాటలో నిలిపాడు. ఇవాళ టీమిండియా ఆసియాకప్ టోర్నీలో హాంకాంగ్ తో పోరుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో, జడేజా మీడియాతో ముచ్చటించాడు. 

ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. ఐపీఎల్ లో చెన్నై జట్టుతో తనకు గొడవలు ఉన్నాయని, తనను టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి తప్పించారని రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయని తెలిపాడు. అన్నింటింకి మించి తాను చనిపోయానంటూ పుకార్లు పుట్టించారని జడేజా తెలిపాడు. అసలు, ఇంతకంటే పెద్ద వదంతి ఇంకేదైనా ఉంటుందా అనిపించిందని విస్మయం వ్యక్తం చేశాడు. 

అయితే, అన్నింటికంటే తనకు క్రికెటే ముఖ్యమని, పుకార్లను పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం, జట్టు కోసం ఏంచేయాలి? అందుకోసం నేను ఏ ఏ రంగాల్లో మెరుగవ్వాలి? అనే విషయాలను తప్ప తాను ఇంకేమీ పట్టించుకోనని అన్నాడు. పుకార్లను పట్టించుకుంటే ఆట ముందుకు సాగదని జడేజా అభిప్రాయపడ్డాడు.


More Telugu News