రోజుకు రెండు మూడు కప్పులు బ్లాక్ టీ తాగితే 'దీర్ఘాయుష్మాన్ భవ'... బ్రిటన్ లో ఆసక్తికర అధ్యయనం

  • అన్ని వర్గాలకు నచ్చే పానీయం టీ
  • ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల టీలు
  • బ్లాక్ టీ తాగేవారిపై బ్రిటన్ లో అధ్యయనం
  • 5 లక్షల మందిని పరిశీలించిన వైనం
టీ తాగడంలో పేద, ధనిక అనే తారతమ్యం ఉండదు. అన్నివర్గాల వారికి ఇష్టమైన పానీయం తేనీరు. గుక్కెడు చాయ్ వేడివేడిగా కడుపులో పడితే ఆ హుషారే వేరు అని సగటు జీవి చెప్పడంలో ఆశ్చర్యమేమీలేదు. అనేకమందికి టీ తాగడంతోనే దినచర్య మొదలవుతుంది. 

ఆరోగ్య ప్రదాయినిగా చాలామంది భావించే టీలలో అనేక రకాలున్నాయి. వాటిలో పాలు కలపని బ్లాక్ టీ కూడా ఒకటి. బ్లాక్ టీతో విశేష లాభాలు ఉన్నాయని తాజా అధ్యయనం చెబుతోంది. రోజుకు రెండు మూడు కప్పులు బ్లాక్ టీ తాగితే దీర్ఘాయుష్షు కలుగుతుందట. మనిషికి మరణాన్ని కలిగించే అన్ని శారీరక రుగ్మతల నుంచి బ్లాక్ టీ కాపాడుతుందట. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్ లో దీనికి సంబంధించిన అధ్యయనం ప్రచురితమైంది. 

ఇతరుల్లో కంటే బ్లాక్ టీ తాగేవారిలో మరణాల ముప్పు తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. బ్రిటన్ లో 40 నుంచి 69 ఏళ్ల వయసున్న సుమారు 5 లక్షల మంది స్త్రీపురుషులపై ఈమేరకు అధ్యయనం నిర్వహించారు. 2006 నుంచి 2010 మధ్య కాలంలో వారియొక్క జన్యు, ఆరోగ్యపరమైన సంపూర్ణ సమాచారాన్ని సేకరించి విశ్లేషించారు. 

రోజుకు ఎన్ని కప్పుల టీ తాగుతారు? ఆ టీలో ఏం కలుపుకుంటారు? ఇత్యాది అంశాలపై వారి నుంచి సమాచారం సేకరించారు. అయితే బ్లాక్ టీ తాగేవారిలో హృదయ సంబంధ జబ్బులు, రక్తం గడ్డకట్టడం ద్వారా సంభవించే గుండెపోటు, పక్షవాతం తదితర సమస్యలు చాలా తక్కువని గుర్తించారు. బ్లాక్ టీ తాగేవారు ఈ ప్రమాదకర సమస్యల కారణంగా మరణించడం కూడా తక్కువేనని వెల్లడైంది. 

టీలో బయోయాక్టివ్ కాంపౌండ్స్ సమృద్ధిగా ఉంటాయని, శరీరంలోని కణజాల వాపును, ఆక్సిజన్ కొరతను, తద్వారా ఏర్పడే ఒత్తిడిని అరికడతాయని పరిశోధకులు వెల్లడించారు. అయితే, టీ తాగాలని గానీ, ఇప్పటికే టీ అలవాటు ఉన్నవారు ఎంత మొత్తంలో టీ తాగాలన్న దానిపై గానీ తాము ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వబోవడంలేదని ఇనో చోయ్ అనే పరిశోధకుడు స్పష్టం చేశారు.


More Telugu News