బ్రిటన్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా తిర్చిదిద్దుతా: రిషి సునాక్ ప్రతిజ్ఞ

  • సెప్టెంబరు 2తో ముగియనున్న ఓటింగ్
  • సెప్టెంబరు 5న ఎన్నికల ఫలితాలు
  • నేడు ఆఖరి ప్రచార కార్యక్రమం
  • రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య హోరాహోరీ
బ్రిటన్ ప్రధాని ఎన్నిక వ్యవహారం మరికొన్నిరోజుల్లో ముగియనుంది. కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా ఎన్నికయ్యే నేత బ్రిటన్ ప్రధానమంత్రి అవుతారు. ఈ నేపథ్యంలో, కన్జర్వేటివ్ పార్టీ నేతలు రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఎన్నికల ప్రచారం ఆఖరి అంకంలోకి ప్రవేశించింది. బుధవారం సాయంత్రం లండన్ లోని వెంబ్లీ వద్ద భారీ ప్రచార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆఖరిసారిగా ఓటర్లను ఆకట్టుకునేందుకు రిషి సునాక్, లిజ్ ట్రస్ తమ వాగ్దాటిని ప్రదర్శించనున్నారు. 

ఈ నేపథ్యంలో రిషి సునాక్ స్పందిస్తూ... దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తానని, బ్రిటన్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దుతానని ప్రతిజ్ఞ చేశారు. ఓ కుటుంబంలా మారదాం, వాణిజ్యాన్ని కొత్తపుంతలు తొక్కిద్దాం. మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనడంలో నాకెలాంటి సందేహంలేదు. అయితే, మనం నిజాయతీతో, విశ్వసనీయతతో కూడిన ప్రణాళికతో తాత్కాలిక సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే ఆశించిన అభివృద్ధి సాధ్యమవుతుంది. 

నా వద్ద కన్జర్వేటివ్ పార్టీ మూలాలు, విలువలతో కూడిన సరైన ప్రణాళిక ఉంది. నేను మొదటి నుంచి స్థిరంగా, చిత్తశుద్ధితో చెబుతున్నాను... మనం ముందు పరిష్కరించాల్సింది ద్రవ్యోల్బణం అంశాన్ని. ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమవుతుంది. తక్కువ పన్నులు, మెరుగైన ఆరోగ్య వ్యవస్థ, సవ్యమైన ఆర్థిక వ్యవస్థ, బ్రెగ్జిట్ ఫలాల సంపూర్ణ సద్వినియోగం, అభివృద్ధి, సమగ్రతల దిశగా పటిష్ఠ పునాది వేసుకోవడానికి ఇదే మార్గం అని వివరించారు. 

కాగా, రిషి సునాక్, లిజ్ ట్రస్ ల మధ్య మెరుగైన అభ్యర్థిని తేల్చడానికి 1.75 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. బ్యాలెట్లు సమర్పించడానికి ఆఖరి తేదీ సెప్టెంబరు 2 కాగా, సెప్టెంబరు 5న బ్రిటన్ ప్రధాని ఎవరో తేలనుంది. 


More Telugu News