తాళి కట్టిన ఆలి తాటతీస్తోందని.. తాటిచెట్టెక్కాడు!

  • ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఘటన
  • 32 రోజులపాటు చెట్టుపైనే గడిపేసిన రాంప్రవేశ్
  • అధికారులు కిందికి దింపే ప్రయత్నంలో కిందపడిన బాధితుడు
  • ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైనం
భార్యల వేధింపులకు సంబంధించి సోషల్ మీడియాలో కనిపించే కార్టూన్లు, జోకులకు కొదవే ఉండదు. షార్ట్స్‌లోనూ ఇలాంటివే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్య వీర కొట్టుడు నుంచి తప్పించుకునేందుకు ఏకంగా వంద అడుగుల పొడవున్న తాటిచెట్టు ఎక్కాడు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఎంత బతిమాలినా కిందికి దిగలేదు సరికదా.. దానినే తన ఆవాసంగా మార్చుకుని 32 రోజులుపాటు పైనే గడిపేశాడు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజం. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పేరు రాంప్రవేశ్. మౌ జిల్లాలోని బరసత్‌పూర్.

భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. దీంతో రెచ్చిపోయిన భార్య.. రాంప్రవేశ్‌ను చితకబాదేది. నిత్యం ఇదే తంతు కావడంతో ఇక ఒళ్లు అప్పగించడం ఇష్టం లేని రాంప్రవేశ్ గ్రామ శివార్లలో వంద అడుగుల పొడవున్న తాటిచెట్టు ఎక్కేశాడు. పైనే ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్నాడు. రాత్రిళ్లు చెట్టుదిగి కాలకృత్యాలు తీర్చుకుని మళ్లీ చెట్టెక్కేసేవాడు. తాడుకట్టిన బుట్టను కిందకు దించితే కుటుంబ సభ్యులు అందులో ఆహారం పెట్టేవారు. దానిని పైకి లాక్కుని తినేవాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు నచ్చజెప్పినా కిందికి దిగి ఇంటికి వచ్చేందుకు రాంప్రవేశ్ నిరాకరించాడు. విషయం అధికారులకు తెలియడంతో వారు అతడిని కిందికి దింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు అతడు కిందపడి గాయపడ్డాడు. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


More Telugu News