జూ నుంచి ఆస్ట్రిచ్ తప్పించుకుంటే ఎలా..? ఓ ఉద్యోగికి వేషమేసి మాక్ డ్రిల్.. భలేగా ఉందంటూ నెటిజన్ల కామెంట్లు!

  • థాయిలాండ్ లోని చియాంగ్ మే జూలో డ్రిల్ నిర్వహించిన అధికారులు
  • ఆస్ట్రిచ్ వేషంలో ఓ ఉద్యోగి పరుగెడుతుంటే వెంటపడి పట్టుకున్న వైనం
  • నిజానికి ఆస్ట్రిచ్ ను పట్టుకోవడం కష్టమే అంటూ కొందరి కామెంట్లు
ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ అగ్నిమాపక శాఖ వాళ్లు మాక్ డ్రిల్స్ చేయడం (ప్రయోగాత్మకంగా ఆ పని చేసి చూడటం) మామూలే. పోలీసులు, వివిధ పారా మిలటరీ బలగాలు కూడా.. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై డ్రిల్స్ చేస్తుండటం కూడా అప్పుడప్పుడూ కనిపిస్తుంటుంది. అయితే థాయిలాండ్ లోని ఓ జంతు ప్రదర్శన శాల (జూ) వాళ్లు చేసిన డ్రిల్ మాత్రం అందరినీ భలేగా ఆకట్టుకుంది.

థాయ్ లాండ్ లోని చియాంగ్ మే జూలో..
  • థాయ్ లాండ్ లోని చియాంగ్ మే జూలో.. ఉన్న సిబ్బంది ఇటీవల ఆస్ట్రిచ్ పక్షి ఒకవేళ బోను నుంచి తప్పించుకుంటే.. దాన్ని ఎలా పట్టుకోవాలన్న దానిపై డ్రిల్ నిర్వహించారు. ఇందుకోసం సిబ్బందిలో ఒకరికి ఆస్ట్రిచ్ లా వేషం వేశారు. ఆస్ట్రిచ్ మెడ, తలను తలపించేలా ఓ పెద్ద టోపీని తయారు చేసి ఆ వ్యక్తికి పెట్టారు. మిగతా శరీర భాగానికి ఆస్ట్రిచ్ లా కనిపించే డ్రెస్ వేశారు.  
  • ఆ వ్యక్తి జూలో ఎటు పడితే అటు వేగంగా పరుగెడుతూ ఉంటే.. ఇతర సిబ్బంది దాన్ని పట్టుకోవడానికి పరుగెత్తుతూ ఉండాలి. ఆ ఏముంది నేరుగా పట్టుకోవడమేగా అనుకోవచ్చు. కానీ అది చాలా కష్టమని జూ సిబ్బంది చెబుతున్నారు. ఎందుకంటే.. ఆస్ట్రిచ్ వేగాన్ని, దాని బలాన్ని అంచనా వేసి.. దాని ప్రకారమే వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ లెక్కలన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. చాలా ఇబ్బందే అనిపించిందని సిబ్బంది అంటున్నారు.
  • మొత్తానికి ఆస్ట్రిచ్ లా రెడీ అయిన వ్యక్తి పరుగెడుతూ ఉంటే.. మిగతా వాళ్లు వెంటపడి చాకచక్యంగా వల వేసి పట్టేసుకున్నారన్న మాట.
  • ‘అందరు హీరోలు సూపర్ హీరో డ్రెస్సులే వేసుకోరు. కొందరు ఆస్ట్రిచ్ లా డ్రెస్ వేసుకుంటారు..’ అనే క్యాప్షన్ తో ఈ వివరాలను టోబె జూ తన ఫేస్ బుక్ పేజీలో పెట్టింది.
  • దీనిపై స్పందించిన నెటిజన్లు ఇదేదో భలేగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘నిజానికి ఆస్ట్రిచ్ దాడి చేస్తే సింహాల వంటి జంతువులే భయపడతాయి. మరి మనుషులు అంత సులువుగా దాన్నిపట్టుకోగలరా?’ అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే.. ‘జూలో ఉండే ఆస్ట్రిచ్ మరీ భయంకరమేం కాదులే..” అంటూ మరో నెటిజన్ పేర్కొన్నారు. మొత్తానికి ఏదైతే ఏంటి ఈ డ్రిల్ ఏదో చిత్రంగా ఉందని అంటున్నారు.
  • ఇంతకుముందు 2019లో టోబె జూలో సింహం తప్పించుకుంటే ఎలా అని ఓ వ్యక్తికి సింహంలా వేషం వేసి డ్రిల్ నిర్వహించారు కూడా.


More Telugu News