బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి ఈడీ నోటీసులు

  • బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని సమన్ల జారీ
  • శుక్రవారం కోల్ కతాలోని ఈడీ కార్యాలయంలో విచారణ ఉంటుందన్న అధికారులు
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తృణమూల్ నాయకులు 
‘బొగ్గు స్మగ్లింగ్ కుంభకోణం’ కేసులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మంగళవారం సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కోసం అభిషేక్ కు నోటీసులు ఇచ్చినట్లు ఒక అధికారి తెలిపారు. కోల్‌కతాలోని ఈడీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం విచారణకు హాజరు కావాలని కోరినట్లు ఆయన తెలిపారు. ‘మా అధికారుల ముందు హాజరుకావాలని అభిషేక్ బెనర్జీకి సమన్లు పంపాము. అయనని విచారించడానికి ఢిల్లీ నుంచి మా అధికారులు వస్తారు’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. 

దీనిపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కక్షపూరితంగానే అభిషేక్ ను టార్గెట్ చేసిందని ఆరోపిస్తున్నారు. తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ సోమవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు. పార్టీలో రెండవ స్థానంలో ఉన్న తన మేనల్లుడు అభిషేక్ తో పాటు ఇతర సీనియర్ నాయకులకు కేంద్ర ఏజెన్సీలు నోటీసులు పంపవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News