బీపీ ఎక్కువ ఉంటే.. లో సోడియం సాల్ట్ పరిష్కారమా?

  • ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోవద్దంటున్న వైద్యులు
  • లో సోడియం సాల్ట్ లో అధిక పొటాషియం
  • పొటాషియం ఎక్కువైతే హైపర్ కేలామియా
  • మూత్రపిండాలు, గుండె వైఫల్య ముప్పు
సోడియం ఎక్కువ ఉంటేనే రక్తపోటు పెరిగిపోవాలని లేదు. మన శరీరంలో రక్త పోటు ఎక్కువగా ఉండడానికి గుండె పనితీరులో మార్పులు, స్థూల కాయం, వ్యాయామ లేమి, ఒత్తిళ్లు, కొన్ని రకాల ఔషధాలు, మద్యపానం ఇలా ఎన్నో ప్రభావం చూపిస్తుంటాయి. అయితే, కారణాలు ఏవైనా కానీయండి.. ఇలా రక్తపోటు అధికంగా ఉన్నవారు ఉప్పు విషయంలో జాగ్రత్తగా మసలు కోవాల్సిందే. ఎందుకంటే అప్పటికే అధిక రక్తపోటు ఉంది కనుక, ఉప్పు (సోడియం) వినియోగం పెరిగితే రక్తపోటు మరింత పెరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. 

రక్తపోటు తగ్గించుకోవడానికి..
రక్తపోటు అదుపునకు కూరల్లో ఉప్పు తగ్గించుకోవడం, విడిగా కలుపుకోకపోవడం, ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్, చిప్స్, పచ్చళ్లకు దూరంగా ఉండడం మంచి మార్గాలు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని సోడియం అధిక నీటిని శరీరంలో ఉంచేస్తుంది. అంటే రక్తంలో నీటి పరిమాణం పెరిగిపోతుంది. దీనివల్ల రక్తనాళాల గోడలపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఇదే రక్తపోటు పెరిగేందుకు దారితీస్తుంది. 

దీనికి పరిష్కారంగా ఇటీవలి కాలంలో ఎఫ్ఎంసీజీ కంపెనీలు లో- సోడియం సాల్ట్ ను విక్రయిస్తున్నాయి. టాటా కన్జ్యూమర్, మారికో సంస్థలు లో సోడియం సాల్ట్ ను మార్కెట్ చేస్తున్నాయి. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఈ లో సోడియం సాల్ట్ లో 15 శాతం తక్కువగా సోడియం ఉంటుంది. అయితే, దీన్ని తీసుకోవడంపై వైద్యులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.  

మంచి ఎంపిక కాదు
నెఫ్రాలజిస్టులు చెబుతున్న దాని ప్రకారం.. లో సోడియం సాల్ట్ ఎంపిక మంచిది కాదు. ఎందుకంటే వీటిల్లో పొటాషియం అధికంగా ఉంటుంది. కనుక సోడియం తగ్గించుకోవాలని చెప్పి, పొటాషియం అధికంగా ఉండే లోసోడియం సాల్ట్ ను తీసుకుంటే.. పొటాషియం పెరిగిపోయి అంతే హాని జరిగే ప్రమాదం ఉంటుంది. రక్తంలో పొటాషియం పెరిగితే హైపర్ కలామియాకు దారితీస్తుంది. పల్స్ రేటు తగ్గడం, గుండె స్పందనల రేటు తగ్గడం, కండరాల బలహీనత ఏర్పడుతుంది. 

ప్రమాదకరం
‘‘ప్రతి నెలా నా వద్దకు ఐదుగురు వరకు లో- సోడియం సాల్ట్ కు మళ్లిన వారు చికిత్స కోసం వస్తున్నారు. వైద్యులను సంప్రదించకుండా సొంతంగా లో సోడియం సాల్ట్ వినియోగిస్తున్న వారే. కొన్ని కేసుల్లో అత్యవసరంగా డయాలసిస్ కూడా చేయాల్సి వస్తోంది. లేదంటే పేస్ మేకర్ కూడా పెట్టాల్సి వస్తోంది’’ అని ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆర్ ఫీ మాథుర్ వెల్లడించారు. వైద్యులను అడగకుండా వేరే ఎలాంటి సాల్ట్ వాడొద్దని ఆయన సూచించారు. 

ఇతర వైద్యులు సైతం లో సోడియం సాల్ట్ ను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించొద్దని సూచిస్తున్నారు. దీని కారణంగా మూత్రపిండాలు, గుండె సమస్యలను చేతులారా ఆహ్వానించినట్టు అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఫోర్టిస్ హెల్త్ కేర్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ అనూప్ మిశ్రా అయితే లో సోడియం సాల్ట్ కు బదులు సాధారణ ఉప్పు తగ్గించి వాడుకోవాలని సూచిస్తున్నారు.


More Telugu News