ఫోన్లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని గుర్తు పట్టని యూపీ క్లర్క్

  • అమేథీ నియోజకవర్గంలో బాధితుడి సమస్య పరిష్కారం కోసం సంబంధిత క్లర్కుకు ఫోన్ చేసిన ఇరానీ
  • ఆమె గొంతు గుర్తుపట్టక స్పందించని సదరు క్లర్క్ 
  • విచారణకు ఆదేశించిన ప్రభుత్వ అధికారులు
కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, అమేథీ ఎంపీ స్మృతి ఇరానీకి వింత అనుభవం ఎదురైంది. తన పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి సమస్య పరిష్కారం కోసం కేంద్ర మంత్రి సంబంధిత ప్రభుత్వ క్లర్క్ (లేఖపాల్)కు ఫోన్ చేశారు. కానీ, ఫోన్లో స్మృతి ఇరానీ గొంతును గుర్తుపట్టలేకపోయిన సదరు క్లర్క్ సమస్యపై స్పందించలేదు. దాంతో, తన విధులను సరిగ్గా నిర్వర్తించలేదనే అభియోగం కింద ఆ క్లర్కుపై విచారణకు ఆదేశించినట్టు యూపీ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 

అమేధీ నియోజకవర్గంలోని ముసాఫిర్ఖానా తహసీల్ పరిధిలోని పూరే పహల్వాన్ గ్రామానికి చెందిన కరుణేష్ అనే వ్యక్తి ఈ నెల 27న ఇరానీకి ఫిర్యాదు లేఖ ఇచ్చారు. ఉపాధ్యాయుడైన తన తండ్రి మరణించిన తర్వాత తల్లి పింఛను పొందేందుకు అర్హులని, అయితే, తహసీల్లో పని చేస్తున్న దీపక్ అనే క్లర్క్ వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడంతో తన తల్లికి పెన్షన్ నిలిచిపోయిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన ఇరానీ శనివారం క్లర్క్ దీపక్ కు ఫోన్ చేశారు. కానీ, అతను ఫోన్లో ఇరానీ గొంతును గుర్తించలేకపోయాడు. దాంతో, మంత్రి.. అమేథీ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (సిడిఓ) అంకుర్ లాథర్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. 

కేంద్ర మంత్రి ఫోన్ కు స్పందించని క్లర్క్ దీపక్ ను తనకు రిపోర్ట్ చేయాలని లాథర్ ఆదేశించారు. విధి నిర్వహణలో అతని అలసత్వం కారణంగానే బాధితుడు కేంద్ర మంత్రిని సంప్రదించాడన్నారు. ఈవిషయంపై ముసాఫిర్ఖానా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ తో విచారణకు కోరామన్నారు. నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని లాథర్ చెప్పారు.


More Telugu News