రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారంటూ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • ఇప్పటికే కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి రేవంత్ పంపిస్తున్నారన్న మల్లారెడ్డి
  • కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా
  • కేసీఆర్ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వ్యాఖ్య
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం తెలిసిందే. బహిరంగ సభల్లో సైతం ఒకరిపై మరొకరు మీసాలు మెలేస్తూ, తొడకొట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా, రేవంత్ ను ఉద్దేశించి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరిపోవడం ఖాయమని ఆయన అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరినీ రేవంత్ బీజేపీలోకి పంపిస్తున్నారని... త్వరలోనే ఆయన కూడా కాషాయ కండువా కప్పుకుంటారని చెప్పారు. 

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దివాలా తీసిందని, బీజేపీ ఒక ఫెయిల్యూర్ పార్టీ అని అన్నారు. ఈ రెండు పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. మునుగోడు ఎన్నిక నేపథ్యంలో ఈ రెండు పార్టీలు కలిసిపోయాయని అన్నారు. మునుగోడులో అమిత్ షా సభ, వరంగల్ లో జేపీ నడ్డా సభ ఫ్లాప్ అయ్యాయని చెప్పారు. కిరాయి మనుషులను తెచ్చుకుని బీజేపీ సభలను నిర్వహించిందని ఎద్దేవా చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ను దేశ్ కీ నేతగా చూడాలని దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని మల్లారెడ్డి చెప్పారు. గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి దేశంలోని ప్రజలంతా కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి కూడా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.


More Telugu News