అదానీనా మజాకా... ప్రపంచ కుబేరుల్లో మూడో స్థానానికి భారత వ్యాపార దిగ్గజం

  • ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు
  • ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ ను నాలుగో స్థానానికి నెట్టిన అదానీ
  • ఈ ఏడాదిలోనే 60.9 బిలియన్ డాలర్ల ఆర్జన
భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ సంపాదనలో దూసుకెళ్తున్నారు. కొన్నేళ్లుగా లక్షల కోట్లు ఆర్జిస్తున్న ఆయన ఇప్పుడు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నారు. ఆసియా నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మాకు సాధ్యం కాని ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. 

‘బ్లూమ్‌బర్గ్’ బిలియనీర్స్ ఇండెక్స్‌ ప్రకారం 137.4 బిలియన్ డాలర్ల సంపదతో అదానీ.. ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి దూసుకెళ్లారు. అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌ తొలి రెండు ర్యాంకుల్లో ఉన్నారు. 

60 ఏళ్ల అదానీ గత కొన్ని సంవత్సరాలుగా తన వ్యాపార సామ్రాజ్యాలను విస్తరిస్తున్నారు. బొగ్గు, పోర్టులు, డేటా సెంటర్లు, సిమెంట్, మీడియా, అల్యూమినియం వరకూ ప్రతీ రంగంలోకి ప్రవేశించారు. అదానీ గ్రూపు ఇప్పుడు భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్- సెక్టార్ పోర్ట్, విమానాశ్రయ ఆపరేటర్, సిటీ--గ్యాస్ డిస్ట్రిబ్యూటర్, బొగ్గు మైనర్‌గా ఉంది. ఆస్ట్రేలియాలోని కార్మైకేల్ గనిపై పర్యావరణవేత్తల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక-శక్తి ఉత్పత్తిదారుగా అవతరించేందుకు గ్రీన్ ఎనర్జీలో అదానీ గ్రూపు 70 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్టు గత నవంబర్లో ప్రకటించింది. 

తన వ్యాపార విస్తరణతో అదానీ ఈ ఏడాదిలోనే ఏకంగా 60.9 బిలియన్లను ఆర్జించారు. ఈ క్రమంలో ఫిబ్రవరిలో ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అంబానీని అధిగమించారు. ఏప్రిల్‌లో సెంటి బిలియనీర్ అయ్యారు. గత నెలలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాలుగో సంపన్న వ్యక్తిగా నిలిచారు. తాజాగా మూడో ర్యాంకుకు చేరుకున్నారు.


More Telugu News