'లైగర్' ఫెయిల్యూర్ కావడంపై ఛార్మీ స్పందన

  • ఎన్నో అడ్డంకులు దాటుకుని సినిమాను విడుదల చేశామన్న ఛార్మీ
  • ఫలితం ఎంతో నిరాశకు గురి చేసిందని ఆవేదన
  • ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే సినిమాలు రానంత వరకు వారు థియేటర్లకు రారని వ్యాఖ్య
భారీ అంచనాల మధ్య విడుదలైన విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల తాజా చిత్రం 'లైగర్' నిరాశను మిగిల్చింది. అంచనాలకు భిన్నంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. బాక్సర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే నటించగా... ఇతర పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రపంచ హెవీ వెయిట్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ నటించారు. ఈ సినిమాకు సినీ నటి ఛార్మీ సహ నిర్మాతగా వ్యవహరించారు. సినిమా ఫెయిల్యూర్ పై ఛార్మీ స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. 

జనాలు ఇంట్లోనే కూర్చొని ఒక్క క్లిక్ తో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను, భారీ బడ్జెట్ మూవీలను చూసే పరిస్థితి ఇప్పుడు ఉందని ఛార్మీ అన్నారు. ప్రేక్షకులను ఎగ్జైట్ చేసే సినిమాలు రానంత వరకు వారు థియేటర్లకు రారని చెప్పారు. ఒక సినిమా కోసం థియేటర్ కి రాకముందే అనేక అంశాలపై ప్రేక్షకులు దృష్టి సారిస్తున్నారని అన్నారు. 'బింబిసార', 'సీతారామం', 'కార్తికేయ2' వంటి చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయని... ఈ చిత్రాలు రూ. 150 కోట్ల నుంచి రూ. 175 కోట్ల వరకు వసూలు చేశాయని చెప్పారు. దక్షిణాదిలో గతంలో ఉన్నంత సినిమా పిచ్చి ఇప్పుడు లేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. బాలీవుడ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉందని అన్నారు. 

ఎన్నో కష్టాలు పడి తాము 'లైగర్' చిత్రాన్ని నిర్మించామని, కానీ ఫలితం నిరాశకు గురి చేసిందని ఛార్మీ ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో తాము బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ ను కలిశామని... 2020 జనవరిలో సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించామని తెలిపారు. అయితే కరోనా కారణంగా మూడు సంవత్సరాల తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని చెప్పారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని, ఎంతో నమ్మకంతో సినిమాను విడుదల చేశామని... కానీ, సినిమా ఫెయిల్యూర్ కావడం అందరినీ బాధకు గురి చేస్తోందని అన్నారు.


More Telugu News