63 వసంతాల అక్కినేని నాగార్జున.. ఆరోగ్య రహస్యం ఏమిటంటే..!
- మితాహారం ఆయన దినచర్యలో భాగం
- ప్రతి రోజూ ఉదయం గంట పాటు వ్యాయామాలు
- 8 గంటలకు తక్కువ కాకుండా నిద్ర
తెలుగు సీనియర్ నటుడు నాగార్జున నేటితో 63 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 1959 ఆగస్ట్ 29న ఆయన జన్మించారు. ఈ వయసులోనూ చూడ్డానికి కుర్రాడి మాదిరిగా, చలాకీగా కనిపిస్తుంటారు. నటనతోపాటు, బిగ్ బాస్ సహా ఎన్నో షోలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం కూడా ఉంది. వృద్ధాప్యం అన్నది ఆపినా ఆగదు. వయసు మీద పడుతుంటే ఆ ఛాయలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కానీ, నాగార్జున విషయంలో అది కనిపించదు. ఆయన్ను చూసిన వారు అంత ఆరోగ్యం, యవ్వనం ఎలా సాధ్యం? అని అనుకుంటూ ఉంటారు.
నాగార్జున ఇప్పటికీ, నిత్యం వ్యాయామం చేస్తారు. ఫిట్ నెస్ ప్రేమికుడు ఆయన. అంతేకాదు, ఆయన భార్య అమల కూడా ఫిట్ నెస్ కు ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఈ దంపతులకు అంత వయసు వచ్చినా చూడ్డానికి అలా కనిపించరు. ‘‘ఏంటి సార్ మీ ఆరోగ్య రహస్యం? ఇప్పటికీ శరీరాన్ని అలా స్లిమ్ గా, షైనీగా ఎలా ఉంచుకోగలుగుతున్నారు?’’ అంటూ టీవీ కార్యక్రమాల సందర్భంగా నాగార్జున ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయన తన ఆరోగ్య రహస్యం ఏంటో కూడా చెప్పారు.
నాగార్జున దినచర్య ఉదయం 6 గంటలకు మొదలవుతుంది. గంటపాటు జిమ్ లో గడుపుతారు. ఆ తర్వాత గుడ్డులో తెల్లసొన, బ్రెడ్ తో కలిపి తీసుకుంటారు. తిరిగి ఉదయం 11 గంటల సమయంలో దోశ లేదా పొంగల్ లేదా ఇడ్లీ తింటారు. మధ్యాహ్నం లంచ్ లో రైస్, రోటి, నాలుగు రకాల కూరలు తింటారు. లంచ్ కు ముందు పండు తీసుకుంటారు. తిరిగి రాత్రి 7 గంటల సమయంలో డిన్నర్ పూర్తి చేస్తారు. ఉడకబెట్టిన కూరగాయలు, గ్రిల్డ్ చికెన్ లేదా చేపలతో తింటారు. రాత్రి 10 గంటలకు ఆయన నిద్రపోవాల్సిందే. నాగార్జున డైటింగ్ చేయరు. ఆరునూరైనా వారంలో ఆరు రోజులు వ్యాయామాలు చేయాల్సిందే.