గౌతమ్ గంభీర్ గురించి నోరు జారిన షాహిద్ అఫ్రిదీ
- తనకు భారత ఆటగాళ్లతో గొడవలేవీ లేవన్న పాక్ మాజీ క్రికెటర్
- కొన్ని సందర్భాల్లో గంభీర్ తో వాదన చోటు చేసుకున్నట్టు వెల్లడి
- గంభీర్ వ్యక్తిత్వాన్ని భారత ఆటగాళ్లు కూడా ఇష్టపడరంటూ వ్యాఖ్య
భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్లు మైదానంలో స్నేహ భావంతోనే మసలుకుంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం కొందరు తమ మనసులోని విషాన్ని కక్కేస్తుంటారు. ఇప్పుడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ అదే పనిచేశాడు. భారత మాజి క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యక్తిత్వాన్ని ఓ టీవీ చర్చా కార్యక్రమం సందర్భంగా తప్పుబట్టాడు. ఇదే కార్యక్రమంలో హర్బజన్ సింగ్ సైతం పాల్గొని పకపకా నవ్వడం గమనార్హం.
షాహిద్ అఫ్రిదీ, గౌతమ్ గంభీర్ మధ్య 2007లో కాన్పూర్ లో వన్డే మ్యాచ్ సందర్భంగా గొడవ జరిగింది. గత కొన్నేళ్లుగా చూసినా ట్విట్టర్ లో ఈ ఇద్దరు వెటరన్ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆదివారం భారత్-పాక్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ సందర్భంగా.. పాక్ కు చెందిన సమా టీవీ చర్చా కార్యక్రమం చేపట్టింది. ఇందులో పాల్గొన్న అఫ్రిదీ ‘‘నాకు భారత ఆటగాళ్లతో గొడవ ఏమీ లేదు. నిజమే కొన్ని సందర్భాల్లో గౌతమ్ గంభీర్ తో సోషల్ మీడియాలో వాదనలు జరిగాయి. నాకు తెలిసి గౌతమ్ ది ఒక రకమైన వ్యక్తిత్వం. దాన్ని ఎవరూ కూడా, భారత జట్టు సభ్యులు సైతం ఇష్టపడరు’’ అని అఫ్రిదీ అన్నాడు.
అఫ్రిదీ వ్యాఖ్యలకు టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హర్బజన్ సింగ్ కూడా నవ్వడం.. భారత క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. ట్విట్టర్ వేదికగా హర్భజన్ తీరును విమర్శించారు. అఫ్రిదీ ఇచ్చింది తప్పుడు ప్రకటనగా పేర్కొన్నారు. గౌతమ్ గంభీర్ ఎప్పుడూ భారత్ వ్యాప్తంగా హీరో అని.. భారత జట్టులో ఎవరూ అతడ్ని ఇష్టపడరంటూ అఫ్రిదీ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడంటూ తప్పుబట్టారు.