ఝార్ఖండ్‌లో దారుణం: ప్రేమకు అంగీకరించని యువతి.. నిద్రిస్తుండగా పెట్రోలు పోసి నిప్పంటించిన యువకుడు

  • 90 శాతం గాయాలతో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
  • నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ రోడ్డెక్కిన బీజేపీ, భజరంగ్ దళ్
  • స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసిన వ్యాపారులు
  • నిందితుడితోపాటు అతడికి పెట్రోలు అందించిన యువకుడి అరెస్ట్
తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో ఓ యువకుడు ప్రేమోన్మాదిగా మారిపోయాడు. నిద్రిస్తున్న యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఝార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. షారూక్ హుస్సేన్ (19) అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ అంకిత (19) అనే అమ్మాయి వెంటపడేవాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపం పెంచుకున్నాడు. 

ఈ క్రమంలో ఈ నెల 23న ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యాడు. 90 శాతం గాయాలైన అంకితను వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ఆమె మరణించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు షారూక్‌తోపాటు అతడికి పెట్రోలు అందించిన చోటు ఖాన్ అనే మరో యువకుడిని అదే రోజు అరెస్ట్ చేశారు. ఇద్దరిపైనా హత్య కేసు నమోదు చేశారు.

ఈ ఘటన రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. విషయం తెలిసిన బీజేపీ, భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేసి నిరసన తెలిపారు. 

కాగా, బాధితురాలు పోలీసులకు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో మాట్లాడుతూ.. షారూక్ తనకు ఫోన్ చేసి ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడని పేర్కొంది. మంగళవారం ఉదయం నిద్రిస్తున్న తనకు కాలుతున్న వాసన వస్తుండడంతో మెలకు వచ్చి చూసే సరికి షారూక్ పారిపోతూ కనిపించాడని, తాను తేరుకునేలోపే మంటలు అంటుకున్నాయని తెలిపింది. వెంటనే తన తండ్రి గదిలోకి పరిగెత్తానని, వారు మంటలు ఆర్పి తనను ఆసుపత్రికి తరలించాలని పేర్కొంది.


More Telugu News