ఆసియా కప్: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్.. పాకిస్థాన్‌పై ఆ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు

  • పొట్టి క్రికెట్‌లో పాకిస్థాన్‌పై నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా భువీ రికార్డు
  •  అద్భుతమైన షార్ట్‌బాల్‌తో పాక్ కెప్టెన్‌ను బురిడీ కొట్టించిన భువనేశ్వర్
  • ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా
ఆసియాకప్‌లో భాగంగా గత రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించి దేశాన్ని మురిపించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భువీ ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 26 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఓ భారత బౌలర్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. 

బాబర్ ఆజం సారథ్యంలో పాకిస్థాన్ జట్టు భారత బౌలర్ల స్వింగ్‌కు ఆది నుంచే బెంబేలెత్తింది. బాబర్ కూడా భువనేశ్వర్‌కే దొరికిపోయాడు. భువీ సంధించిన షార్ట్‌బాల్‌ను ఎదుర్కోవడంలో తడబడి వికెట్ సమర్పించుకున్నాడు. అది మొదలు పాకిస్థాన్ క్రమంగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. మరోవైపు, భువనేశ్వర్ తన పదునైన బంతులతో పాక్‌ను ఆత్మరక్షణలోకి నెట్టేశాడు. ఆ తర్వాత షాదాబాద్ ఖాన్, అసిఫ్ అలీ, నసీమ్ షాలను వెనక్కి పంపి మొత్తం నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

భారత బౌలర్ల బృందం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం 10 వికెట్లూ నేలకూల్చింది. భువీ పాకిస్థాన్‌పై తన బెస్ట్ నమోదు చేయగా, హార్దిక్ పాండ్యా కూడా కీలకమైన మూడు వికెట్లు పడగొట్టడంతోపాటు బ్యాటింగులో 17 బంతుల్లోనే 4 ఫోర్లు, సిక్సర్‌తో 33 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గా నిలిచాడు.


More Telugu News