కేసీఆర్​ రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్​

  • రైతులకు నష్టం కలిగించేలా టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఫైర్
  • కేసీఆర్ తీరుతో నల్లగొండ జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయమని మండిపాటు
  • 246 జీవో రద్దు చేయాలని లేదంటే నిరాహార దీక్ష చేస్తానని ప్రకటన
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారని.. ఆయన చర్యలు రైతులకు నష్టం కలిగించేలా ఉన్నాయని కాంగ్రెస్‌ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 246 తీసుకొచ్చిందని, దానివల్ల నల్లగొండ జిల్లా ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని మండిపడ్డారు. 

ఇప్పటికీ అన్యాయమే..
తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు గడిచినా నల్లగొండ జిల్లా రైతాంగానికి ఇంకా అన్యాయం జరుగుతూనే ఉందని వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు. 1980లోనే నల్లగొండ ప్రజలకు ఎస్‌ఎల్‌ బీసీ ద్వారా 45 టీంఎసీలు కేటాయించారని గుర్తుచేశారు. అవి ఇప్పటికీ అందకపోగా, ఈ 45 టీఎంసీల నీటిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం 246 జీవో తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాల ప్రజల మధ్య కేసీఆర్ చిచ్చుపెడుతున్నారని పేర్కొన్నారు. 

ఏపీ తరలిస్తున్నా పట్టించుకోరా?
కృష్ణా నది నుంచి ఏపీ సీఎం జగన్‌ రోజుకు 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తున్నా.. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జీవో నంబర్‌ 246ను వెంటనే రద్దు చేయకపోతే దీక్ష చేస్తానని వెంకటరెడ్డి ప్రకటించారు.



More Telugu News