బీజేపీ కోసం ప్ర‌చారం చేయ‌డానికి నితిన్‌, మిథాలీ ఓకే చెప్పారు: ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌

  • జేపీ న‌డ్డాతో మిథాలీరాజ్‌, నితిన్‌లు వేర్వేరుగా భేటీ
  • ఈ భేటీల గురించి వివ‌రాలు వెల్ల‌డించిన బీజేపీ ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌
  • బీజేపీ కోసం ప్ర‌చారం చేయ‌డానికి ఇద్ద‌రూ అంగీక‌రించార‌న్న ఎంపీ
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో టాలీవుడ్ యువ హీరో నితిన్ స‌మావేశం కాసేప‌టి క్రితం ముగిసింది. బండి సంజ‌య్ పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా వ‌రంగ‌ల్‌లో బీజేపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ అనంత‌రం హైద‌రాబాద్ వ‌చ్చిన జేపీ న‌డ్డా... శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో బ‌స చేయ‌గా.. బీజేపీ ఆహ్వానం మేర‌కు హోట‌ల్‌కు వెళ్లిన నితిన్... న‌డ్డాతో స‌మావేశ‌మయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో న‌డ్డా, నితిన్‌ల‌తో పాటు బీజేపీ ఎంపీ ల‌క్ష్మ‌ణ్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచంద‌ర్ రావులు పాల్గొన్నారు.

న‌డ్డాతో భేటీ ముగించుకుని నితిన్ వెళ్లిపోయిన త‌ర్వాత ల‌క్ష్మ‌ణ్ మీడియాతో మాట్లాడారు. నితిన్‌తో పాటు శ‌నివారం మ‌ధ్యాహ్నం జేపీ న‌డ్డాతో భేటీ అయిన మాజీ క్రికెట‌ర్ మిథాలీ రాజ్ బీజేపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డానికి సానుకూలత వ్య‌క్తం చేశార‌ని ఆయ‌న చెప్పారు. ఈ దిశ‌గా జేపీ న‌డ్డా చేసిన ప్ర‌తిపాద‌న‌కు వారిద్ద‌రూ అంగీక‌రించార‌న్నారు. ప్ర‌ధాని మోదీ కోసం అవ‌స‌ర‌మైతే బీజేపీ త‌ర‌ఫున ప‌ని చేయ‌డానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని వారు చెప్పిన‌ట్లు ల‌క్ష్మ‌ణ్ తెలిపారు.


More Telugu News