సీఎం ఇంటిని ముట్ట‌డిస్తే చూస్తూ ఊరుకుంటామా?: ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

  • సీపీఎస్ బ‌దులుగా జీపీఎస్ తెస్తామ‌న్న మంత్రులు
  • ఓపీఎస్ మిన‌హా మ‌రే ప్ర‌తిపాద‌న స‌మ్మ‌తం కాద‌న్న ఉద్యోగ సంఘాలు
  • సీఎం ఇంటి ముట్టడిని అడ్డుకుని తీరతామ‌న్న బొత్స‌
  • రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా ఉద్యోగులు ఆలోచించాల‌ని ప్ర‌తిపాద‌న‌
కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్ (సీపీఎస్‌)ను ర‌ద్దు చేసి పాత పెన్ష‌న్ విధానాన్ని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాల‌తో ఏపీ మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌లు శుక్ర‌వారం జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. సీపీఎస్ బ‌దులుగా జీపీఎస్ పేరిట కొత్త పెన్ష‌న్ విధానాన్ని అమ‌లు చేస్తామన్న మంత్రుల ప్ర‌తిపాద‌న‌కు ఉద్యోగ సంఘాలు స‌సేమిరా అన్నాయి. ఈ క్ర‌మంలో పాత పెన్ష‌న్ స్కీమ్ (ఓపీఎస్) అమ‌లు కోసం ప్ర‌క‌టించిన ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌లో భాగంగా సెప్టెంబ‌ర్ 1న ఛ‌లో విజ‌య‌వాడ‌తో పాటు సీఎం ఇంటి ముట్ట‌డిని కొన‌సాగిస్తామ‌ని ఉద్యోగ సంఘాలు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల హెచ్చ‌రిక‌ల‌పై తాజాగా శ‌నివారం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా బొత్స ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితుల దృష్ట్యా ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన కొత్త పెన్ష‌న్ విధానంపై ఉద్యోగులు ఆలోచించి సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆయ‌న అన్నారు. ఉద్యోగ సంఘాలకు వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఉద్య‌మాలు చేసే హ‌క్కు ఉంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే నేరుగా సీఎం ఇంటినే ముట్ట‌డిస్తూ ఉంటే... ప్ర‌భుత్వ యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? అని బొత్స ప్ర‌శ్నించారు. సీఎం ఇంటి ముట్ట‌డిని అడ్డుకుని తీర‌తామ‌ని ఆయ‌న తెలిపారు.


More Telugu News