కేసీఆర్... కళ్లుంటే చూడు, కాళ్లుంటే తెలంగాణలో తిరుగు... కేంద్రం చేసిన అభివృద్ధి కనిపిస్తుంది: కిషన్ రెడ్డి

  • హన్మకొండలో బీజేపీ సభ
  • కుటుంబ పాలనకు వ్యతిరేక సభ అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
  • వరంగల్ లో స్మార్ట్ సిటీ కోసం కేంద్రం రూ.196 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడి  
  • రాష్ట్రంలో రోడ్ల కోసం కేంద్రం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్న కేంద్ర మంత్రి 
బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హన్మకొండలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ ఇన్చార్జి సునీల్ బన్సల్ తదితరులు హాజరయ్యారు. 

ఈ సభలో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు అని కొనియాడారు. కాకతీయుల శౌర్యానికి, రాణి రుద్రమ సుపరిపాలనకు కేంద్రం ఓరుగల్లు అని వివరించారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా, కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఇవాళ ఓరుగల్లులో సభ నిర్వహించుకుంటున్నామని చెప్పారు. 

"అయ్యా కేసీఆర్ గారూ, కేసీఆర్ కుటుంబ సభ్యులారా, వాళ్ల మోచేతి నీళ్లు తాగే టీఆర్ఎస్ నాయకుల్లారా... చెవులు ఉంటే వినండి... మోదీ వచ్చాక ఎంత అభివృద్ధి జరిగిందో నేను చెబుతా. వరంగల్ లో స్మార్ట్ సిటీ కోసం కేంద్రం రూ.196 కోట్లు ఖర్చు చేసింది. వరంగల్ జిల్లాలో సైనిక స్కూల్ రాబోతోంది. వరంగల్ లో రూ.500 కోట్లతో బైపాస్ రోడ్డు వేశాం. రాష్ట్రంలో రోడ్ల కోసం కేంద్రం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. 

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చాం. రామప్ప ఆలయ అభివృద్ధి కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం వేల కోట్లు ఇచ్చింది. ఇవన్నీ కేంద్రం ఇవ్వలేదని టీఆర్ఎస్ సర్కారు చెప్పగలదా? కేంద్రం ఇచ్చిన నిధులను టీఆర్ఎస్ సర్కారు దుర్వినియోగం చేస్తోంది. రూ.8,200 కోట్లతో పత్తి కొనుగోలు చేస్తున్నాం. జగిత్యాల-వరంగల్ రోడ్డు కోసం కేంద్రం రూ.4,321 కోట్లు ఖర్చు చేస్తోంది. వరంగల్-ఖమ్మం రోడ్డు కోసం కేంద్రం రూ.3,364 కోట్లు ఖర్చు చేస్తోంది. 

దేశవ్యాప్తంగా మోదీ చలవ వల్ల ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ పొందారు. నేటి సభలో మాస్కుల్లేకుండా పాల్గొంటున్నామంటే అందుకు మోదీనే కారణం. కేసీఆర్ గారూ... కళ్లుంటే చూడండి, కాళ్లుంటే తెలంగాణలో తిరగండి... అభివృద్ధి అర్థమవుతుంది అంటూ ప్రసంగించారు. 

1300 కిమీ రైల్వేలైనుకు రాష్ట్ర సర్కారు భూమి కేటాయించలేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన మొదటిరోజే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తామని అన్నారు.


More Telugu News