'ఛ‌లో విజ‌య‌వాడ' విర‌మించుకోవాలన్న బొత్స‌, బుగ్గన... సీఎం ఇంటి ముట్ట‌డి త‌థ్య‌మ‌న్న ఉద్యోగులు

  • ఉద్యోగ సంఘాల‌తో మంత్రులు బుగ్గ‌న‌, బొత్స భేటీ
  • సీపీఎస్ కు బ‌దులుగా జీపీఎస్ అమ‌లు చేస్తామ‌ని ప్ర‌తిపాద‌న‌
  • జీపీఎస్‌కు స‌సేమిరా అన్న ఉద్యోగ సంఘాల నేత‌లు
  • చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన‌ట్లుగా ప్ర‌క‌ట‌న‌
  • ఛ‌లో విజ‌య‌వాడ కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డి
కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీం(సీపీఎస్‌) ర‌ద్దును డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో శుక్ర‌వారం ఏపీ ప్ర‌భుత్వం జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. ఈ మేర‌కు శుక్ర‌వారం అమ‌రావ‌తిలోని స‌చివాల‌యం వేదిక‌గా మంత్రులు బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌లు... ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో భేటీ అయ్యారు. సీపీఎస్ రద్దు చేయ‌డానికి త‌మ‌కేమీ అభ్యంత‌రం లేద‌న్న మంత్రులు... దాని స్థానంలో జీపీఎస్‌ను అమ‌లు చేస్తామ‌ని తెలిపారు. 

ఈ ప్ర‌తిపాద‌న‌కు ఉద్యోగ సంఘాల‌న్నీ ఒక్కుమ్మ‌డిగా వ్య‌రేతికత తెలిపాయి. అంతేకాకుండా కొత్త‌గా స‌మావేశ‌మ‌ని చెప్పి... అన్నీ పాత అంశాలే ఎలా ప్ర‌స్తావిస్తార‌ని కూడా మంత్రుల తీరుపై ఉద్యోగ సంఘాలు మండిప‌డ్డాయి. జీపీఎస్ అమ‌లుకు తాము వ్య‌తిరేక‌మ‌ని ఇదివ‌ర‌కే చెప్పిన‌ట్లు కూడా ఉద్యోగులు తెలిపారు. అయితే ఓపీఎస్ అమ‌లు చేయ‌డం వ‌ల్ల కేంద్రం నుంచి నిధులు రావ‌ని మంత్రులు తెలిపారు.

అస‌లు సీపీఎస్ ర‌ద్దు సాధ్యం కాద‌న్న విష‌యం తెలిసి కూడా దానిని ర‌ద్దు చేస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు ఎలా హామీ ఇచ్చార‌ని మంత్రుల‌ను ఉద్యోగ సంఘాలు నిల‌దీశాయి. ఈ క్ర‌మంలో ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌ని గ్ర‌హించిన మంత్రులు... సెప్టెంబ‌ర్ 1న నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన ఛ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేయాల‌ని కోరారు. ఈ వ్య‌వహారంపై మ‌రింత మేర లోతుగా చ‌ర్చ‌లు జ‌రుపుదామ‌ని, అప్ప‌టిదాకా ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని వారు ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను కోరారు. 

మంత్రుల ప్ర‌తిపాద‌న‌ల‌కు కుద‌ర‌ద‌ని చెప్పిన ఉద్యోగ సంఘాల నేత‌లు స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డే మీడియాతో మాట్లాడుతూ మంత్రుల‌తో త‌మ చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన‌ట్లుగా ప్ర‌క‌టించారు. అంతేకాకుండా సెప్టెంబ‌ర్ 1న నిర్వ‌హించత‌ల‌పెట్టిన ఛ‌లో విజ‌య‌వాడ య‌థాత‌థంగా సాగుతుంద‌ని, ముఖ్య‌మంత్రి ఇంటిని ముట్ట‌డించే కార్య‌క్ర‌మాన్ని కూడా కొన‌సాగిస్తామ‌ని వారు తేల్చిచెప్పారు.


More Telugu News