వ‌రంగల్‌లో బీజేపీ స‌భ‌కు హైకోర్టు అనుమ‌తి

  • ఆఖరి నిమిషంలో స‌భ‌కు అనుమ‌తి ఇవ్వ‌ని ప్ర‌భుత్వం
  • హైకోర్టును ఆశ్ర‌యించిన బీజేపీ తెలంగాణ శాఖ‌
  • క‌ళాశాల‌లో రాజ‌కీయ పార్టీల స‌మావేశాలు కూడ‌ద‌న్న ఏజీ
  • త‌మ కంటే ముందు చాలా పార్టీలు అక్క‌డే స‌భ‌లు పెట్టాయ‌న్న బీజేపీ 
తెలంగాణ‌లో విప‌క్షంగా ఉన్న బీజేపీకి వ‌రుస‌గా రెండో రోజు హైకోర్టులో సానుకూల తీర్పు వ‌చ్చింది. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్ సాగిస్తున్న ప్ర‌జా సంగ్రామ యాత్ర మూడో ద‌శ రేపు వ‌రంగ‌ల్‌లో ముగియ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా హ‌న్మకొండ‌లో భారీ బ‌హిరంగ స‌భ‌కు బీజేపీ ప్లాన్ చేసింది. అయితే ఈ స‌భ‌కు అనుమ‌తి లేదంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. దీంతో షాక్ తిన్న బీజేపీ... ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టును ఆశ్రయించింది. వ‌రంగ‌ల్ స‌భ‌కు అనుమ‌తి ఇవ్వాలంటూ బీజేపీ హైకోర్టును కోరింది.

ఈ నెల 27న (రేపు) స‌భ ఉన్న నేప‌థ్యంలో త‌మ పిటిష‌న్‌ను అత్య‌వ‌స‌రంగా విచారించాల‌న్న బీజేపీ అభ్య‌ర్థ‌న మేర‌కు హైకోర్టు శుక్ర‌వారం ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టింది. విచార‌ణ సంద‌ర్భంగా హ‌న్మ‌కొండ కాలేజీ గ్రౌండ్‌కు ఒకే ప్ర‌వేశ ద్వారం ఉంద‌ని, ఇలాంటి ప్ర‌దేశంలో భారీ బ‌హిరంగ స‌భ‌కు అనుమ‌తి ఇస్తే ప్ర‌మాద‌మ‌ని, అంతేకాకుండా క‌ళాశాల‌లో రాజకీయ పార్టీల స‌భ‌ల‌కు అనుమ‌తి మంచిది కాద‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫున అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ బీఎస్ ప్ర‌సాద్ తెలిపారు. 

అయితే హ‌న్మ‌కొండ క‌ళాశాల‌లో స‌భ ఏర్పాటు చేస్తున్న వాళ్లం తామే తొలి వాళ్లం కాద‌ని, చాలా పార్టీల వాళ్లు చాలా సార్లు అక్క‌డే స‌భలు, స‌మావేశాలు నిర్వ‌హించుకున్నార‌ని బీజేపీ త‌ర‌ఫు న్యాయ‌వాది వాదించారు. ఈ సంద‌ర్భంగా ఇరువర్గాల వాద‌న‌ల‌ను విన్న హైకోర్టు రేపటి వ‌రంగ‌ల్ బీజేపీ స‌భకు అనుమ‌తి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ స‌భ‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు.


More Telugu News