చరిత్ర సృష్టించిన అమలాపురం కుర్రాడు, భారత షట్లర్ సాత్విక్

  • చిరాగ్ షెట్టితో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్స్ లో  సెమీఫైనల్ కు చేరుకున్న యువ క్రీడాకారుడు
  • ఈ  టోర్నీ పురుషుల డబుల్స్ లో పతకం ఖాయం చేసుకున్న భారత తొలి జోడీగా రికార్డు
  • క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయిన హెచ్ ఎస్ ప్రణయ్ 
అమలాపురం కుర్రాడు, భారత డబుల్స్ షట్లర్ సాత్విక్ సాయిరాజ్ చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్రకు చెందిన తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్స్ లో సెమీఫైనల్ చేరుకుని కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకున్నాడు. 

దాంతో, ఈ టోర్నీ చరిత్రలో పతకం అందుకోబోతున్న భారత మెన్స్ డబుల్స్ తొలి జోడీగా సాత్విక్- చిరాగ్ శెట్టి జంట రికార్డు కెక్కనుంది. ఓవరాల్ గా ఈ మెగా టోర్నీ డబుల్స్ విభాగంలో భారత్ కు ఇది రెండో పతకం కానుంది. 2011లో గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప జోడీ మహిళల డబుల్స్ లో కాంస్య పతకం సాధించింది. 

టోక్యో వేదికగా జరుగుతున్న తాజా టోర్నీలో భారత్ నుంచి సాత్విక్- చిరాగ్ జంట మాత్రమే మిగిలింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఈ జంట 24-22, 15-21, 21-14తో జపాన్ కు చెందిన టకుర హొకి- యుగో కొబయాషి జంటపై మూడు గేమ్స్ పై పోరాడి అద్భుత విజయం సాధించింది. శనివారం జరిగే సెమీఫైనల్లో భారత జోడీ... మలేసియాకు చెందిన ఆరో సీడ్ జోడీ ఆరోన్ చియా- సో వూయి యిక్ ద్వయంతో అమీతుమీ తేల్చుకోనుంది. 

మరోవైపు పురుషుల సింగిల్స్ లో మిగిలిన హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. క్వార్టర్స్ లో అతను 21-19, 6-21, 18-21తో చైనాకు చెందిన జావో జున్ పెంగ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్ లో కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, సాయి ప్రణీత్ ఆరంభ రౌండ్లలోనే ఓడగా... మహిళల సింగిల్స్ లో సైనా నెహ్వాల్ ప్రీక్వార్టర్స్ లో ఇంటిదారి పట్టింది. మహిళల డబుల్స్, మిక్స్ డ్ డబుల్స్ లోనూ భారత జంటలన్నీ ఇప్పటికే ఇంటిదారి పట్టాయి. కాగా, గాయం కారణంగా స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ టోర్నీకి దూరంగా ఉంది.


More Telugu News