దక్షిణాదిలో కథలను నమ్ముకుంటే.. బాలీవుడ్ లో కథానాయకులను అమ్ముకుంటున్నారు: అనుపమ్ ఖేర్

  • ఈ మధ్య  సత్తా చాటుతున్నదక్షిణాది చిత్రాలు
  • బాలీవుడ్ చిత్రాలు వరుసగా విఫలమవడంపై స్పందించిన అనుపమ్ 
  • బాలీవుడ్ సినిమాలు  హీరోల చుట్టూనే తిరుగుతున్నాయని వ్యాఖ్య
బాలీవుడ్ పై సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య దక్షిణాది చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా మారుతున్నప్పుడు బాలీవుడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎందుకు ఎక్కువగా విఫలమయ్యాయనే దానిపై ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు. దక్షిణాది సినిమాలు మంచి కథలపై దృష్టి సారించాయన్నారు. కానీ, బాలీవుడ్ సినిమాల మాత్రం హీరో చుట్టూనే తిరుగుతున్నాయన్నారు. అందుకే సౌత్ సినిమాలు దూసుకెళ్తుంటే బాలీవుడ్ డీలా పడిందన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ సౌత్ ఇండియన్ సినిమాల విధానాన్ని ప్రశంసించారు. 

'‘మనం వినియోగదారుల కోసం వస్తువులను తయారు చేస్తున్నాం అనుకుందాం. ఎప్పుడైతే వినియోగదారులను చిన్నచూపు చూడటం ప్రారంభిస్తామో అప్పటి నుంచే సమస్య మొదలవుతుంది. ‘మేం ఒక గొప్ప సినిమా చేయడం ద్వారా మీకు మేలు చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఒక గొప్ప సినిమా చూస్తారు’ అనుకోవడం తప్పు. ఎందుకంటే గొప్పతనం అనేది సమష్టి కృషితో సాధ్యం అవుతుంది. నేను  తెలుగు సినిమాలు చేయడం ద్వారా ఈ విషయం నేర్చుకున్నా. 

ఈ మధ్యే తెలుగులో మరో సినిమాలో నటించా. తమిళ భాషలో ఒక సినిమా చేసాను. ఇప్పుడు మలయాళ చిత్రంలో కూడా నటించబోతున్నా. దక్షిణాదిలో నేను ఏ రెండింటి మధ్య భేదం చూడటం లేదు. కానీ, దక్షిణాది వాళ్లు హాలీవుడ్ ను ఇష్టపడరు. వాళ్లు మంచి కథలనే నమ్ముకున్నారు. ఇక్కడ (బాలీవుడ్) మాత్రం మేం స్టార్లను అమ్ముతున్నాము’ అని అనుపమ్ చెప్పుకొచ్చారు.
 
అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. నిఖిల్ సిద్ధార్థ హీరోగా వచ్చిన ‘కార్తికేయ 2’ లో ఆయన అతిధి పాత్రలో కనిపించాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ తెలుగు చిత్రం.. హిందీతో పాటు పలు భాషల్లో భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ అయింది. 

ఇదిలావుంచితే, బాలీవుడ్ లో అనుపమ్ సూరజ్ బర్జాత్యా దర్శకత్వం వహిస్తున్న ‘ఉంఛై’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, బోమన్ ఇరానీ, పరిణీతి చోప్రా కూడా ఉన్నారు. మరోవైపు కంగనా రనౌత్ ప్రధాన పోషించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో అనుపమ్  జయప్రకాష్ నారాయణ్‌ పాత్రంలో  కనిపించనున్నారు.


More Telugu News