బిల్కిస్ బానో కేసు: గ్రామాన్ని ఖాళీ చేసిన ముస్లింలు.. తిరిగి అప్పుడే వస్తామంటూ ప్రతిజ్ఞ!

  • గ్రామాన్ని ఖాళీ చేసి దేవగఢ్ బరియాకు వలస వెళ్లిన ముస్లిం కుటుంబాలు
  • హంతకులు గ్రామానికి వచ్చి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారంటున్న బాధితులు
  • రేపిస్టులను తిరిగి జైలుకు పంపాకే గ్రామంలో అడుగుపెడతామని కలెక్టర్‌కు లేఖ
బిల్కిస్ బానో కేసు దోషులు 11 మందిని గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష కింద విడిచిపెట్టినప్పటి నుంచి భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న రంధిక్‌పూర్ గ్రామంలోని ముస్లింలు తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లిపోయారు. వారిని తిరిగి జైలుకు పంపిన తర్వాతే తిరిగి గ్రామంలో అడుగుపెడతామని ప్రతిజ్ఞ చేశారు. 

గ్రామాన్ని విడిచిపెట్టిన ముస్లింలు దేవగఢ్ బరియాకు వలస వెళ్లారు. దోషులను తిరిగి జైలుకు పంపడంతోపాటు తాము గ్రామంలోకి తిరిగి వచ్చేందుకు పోలీసు రక్షణ కల్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, అత్యాచారానికి గురైన బిల్కిస్ బానో, ఆమె కుటుంబ సభ్యులు దేవగఢ్ బరియా గ్రామంలోనే నివసిస్తున్నారు.

రంధిక్‌పూర్ గ్రామానికి చెందిన వాహన వ్యాపారి సమీర్ గచ్చి కూడా తన 12 మంది కుటుంబ సభ్యులతో గ్రామాన్ని విడిచిపెట్టి దేవగఢ్ బరియాలోని తన బంధువుల ఇంటికి వెళ్లిపోయాడు. సమీర్ మాట్లాడుతూ.. తమకు తొలుత ఆ 11 మంది రేపిస్టులు, హంతకులు జైలు నుంచి విడుదలయ్యారన్న విషయం తెలియదన్నారు. వారు గ్రామానికి చేరుకున్నాక బాణసంచా కాల్చి, సంగీత్‌తో సంబరాలు చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. 

అప్పుడే తమకు భయం మొదలైందని, గ్రామాన్ని వదిలిపెట్టి దేవగఢ్ బరియాకు వలస వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఈ ఘటన తర్వాత తాము దహోడ్ కలెక్టర్‌కు లేఖ రాశామని, ఆ 11 మందిని మళ్లీ జైలుకు పంపి బిల్కిస్ బానోకు న్యాయం చేయాల్సిందిగా కోరామని అన్నారు. అలా జరగకుంటే తాము తిరిగి గ్రామంలో అడుగుపెట్టబోమని తేల్చి చెప్పారు. కలెక్టర్‌కు పంపిన ఆ లేఖలో 55 మంది సంతకాలు చేశారు.


More Telugu News